Bhatti Vikramarka: హైదరాబాద్ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (SLBC) సమావేశంలో మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క!
2025-26 వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. బ్యాంకింగ్ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటేనే ఆ సమాజం, ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి బ్యాంకింగ్ రంగం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు.
- By Kode Mohan Sai Published Date - 02:40 PM, Thu - 22 May 25

Bhatti Vikramarka: 2025-26 వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. బ్యాంకింగ్ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటేనే ఆ సమాజం, ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి బ్యాంకింగ్ రంగం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు. సుమారు ఐదు లక్షల మంది యువతకు స్వయం ఉపాధి పథకం ద్వారా ఆర్థిక సహకారాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాస పథకం తీసుకొచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాస పథకానికి 6,250 కోట్ల రూపాయలు సబ్సిడీ రూపేనా ఇస్తుంది.
చదువుకొని ప్రజ్ఞ పాటవాలు మేధస్సు కలిగిన యువతను ఖాళీగా వదిలేస్తే సమాజానికి మంచిది కాదు. అందుకని వారిని ఉత్పత్తి రంగంలోకి తీసుకువచ్చి రాష్ట్ర జిడిపి పెరిగే విధంగా ఈ పథకం రూపకల్పన చేశాం.
జూన్ రెండున ఐదు లక్షల మంది యువతకు రాజీవ్ యువ వికాసం సాంక్షన్ లెటర్లు పంపిణీ చేస్తున్నాం. నిర్దేశించుకున్న ఈ లక్ష్యాన్ని అనుకున్న సమయంలోగా చేరుకోవడానికి బ్యాంకర్లు తగిన తోడ్పాటు అందించాలి. అన్ని బ్యాంకుల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పర్యవేక్షణ చేయడానికి రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా నోడల్ అధికారి నియామకం చేసి రాజీవ్ యువ వికాస పథకాన్ని ముందుకు తీసుకువెళ్లాలి
ప్రజా ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నది. ఇందులో ఉద్యానవన పంటలకు పెద్దపీట వేస్తున్నది. ఆయిల్ ఫామ్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. 21 వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులను బ్యాంకుల్లో జమ చేశాం. రైతు భరోసా ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నాం. రైతు బీమా ప్రీమియం డబ్బులు ప్రభుత్వమే చెల్లిస్తున్నది. అడవిలో అనాదిగా ఇబ్బందులు పడుతున్న అడవి బిడ్డల జీవన ప్రమాణాలు పెంచడానికి ప్రజా ప్రభుత్వం ఇందిరా సౌర గిరి జల వికాస పథకం తీసుకొచ్చింది
12600 కోట్ల రూపాయలతో అటవీ ప్రాంతంలో ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలు పొంది ఉన్న ఆరు లక్షల 70 వేల ఎకరాలను సౌర విద్యుత్తు ద్వారా సాగులోకి తీసుకువచ్చే నూతన పథకాన్ని ప్రారంభించాం అని అన్నారు. మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది ఈ ఏడాది మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు 20,000 కోట్ల పైగా ఇచ్చాం. రానున్న ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్లకు పైగా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. వడ్డీ లేని రుణాలు ఇవ్వడంతో పాటు మహిళలు వ్యాపారం చేసుకోవడానికి కావలసిన అనేక మార్గాలను కూడా ప్రభుత్వమే చూపిస్తున్నది ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేయించి వాటిని ఆర్టిసి సంస్థలో అద్దెకు నడిపించడం, మహిళలతో సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేయించడం లాంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళుతున్నాం
రాష్ట్ర ప్రభుత్వం న్యూ ఎనర్జీ పాలసీ తీసుకువచ్చి 2030 సంవత్సర నాటికి రాష్ట్రంలో 20వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకొని ప్రణాళిక ప్రకారం గా ముందుకు వెళ్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మానవ వనరులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ముందుకు వెళుతున్నది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ప్రోత్సహిస్తూ విద్యావంతులైన మానవ వనరులను పెద్ద ఎత్తున ఈ సమాజానికి అందించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది.
స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుతో పాటు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నాం పరిశ్రమల్లో పనిచేయడానికి కావలసిన ట్రైనింగ్ ఇందులో ఇప్పిస్తాం. ప్రభుత్వం మూసి పునర్జీవం కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళుతున్నది, ఔటర్ రింగ్ రోడ్ రీజినల్ రింగ్ రోడ్ మధ్యన అనేక రకాలైన క్లస్టర్ తో పారిశ్రామికీకరణ అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేస్తున్నాం అని అన్నారు.