BRS : బాల్కా సుమన్‌కు ఊరట.. సింగరేణి కేసులో కీలక అభియోగాలను కొట్టివేసిన కోర్టు
- Author : Prasad
Date : 02-06-2026 - 8:33 IST
Published By : Hashtagu Telugu Desk
సింగరేణి సంస్థలకు సంబంధించిన వ్యాఖ్యల కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్‌కు ఊరట లభించింది. ఈ కేసులో పోలీసులు నమోదు చేసిన పలు అభియోగాలను నాంపల్లి కోర్టు కొట్టివేస్తూ.. రెండు సెక్షన్ల కింద మాత్రమే విచారణ కొనసాగించాలని ఆదేశించింది. బీఎన్ఎస్ సెక్షన్లు 152, 353(1)(బి) మాత్రమే ఈ కేసుకు వర్తిస్తాయని కోర్టు స్పష్టం చేసింది. ప్రజా ఆస్తుల నష్ట నివారణ చట్టం (PDPP Act)తో పాటు పోలీసులు నమోదు చేసిన ఇతర అభియోగాలను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. మే 26న తెలంగాణ భవన్‌లో నిర్వహించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) సమావేశంలో బాల్కా సుమన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ సందర్భంగా నాంపల్లిలోని సింగరేణి భవన్, మందమర్రిలోని సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయానికి సంబంధించిన వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
సింగరేణి భవన్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నాంపల్లి పోలీసులు బాల్కా సుమన్‌పై కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ సెక్షన్లు 152, 353(1)(బి)తో పాటు 61(2)(ఎ), 326(జి), 351(3) మరియు ప్రజా ఆస్తుల నష్ట నివారణ చట్టంలోని నిబంధనలను కూడా కేసులో చేర్చారు. కేసు నమోదు అనంతరం బాల్కా సుమన్‌ను తెలంగాణ భవన్‌లో పోలీసులు అరెస్టు చేసి, మే 30న కోర్టులో హాజరుపరిచారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, సింగరేణి ఆస్తులను లక్ష్యంగా చేసుకుని పిలుపునిచ్చారని ఆరోపిస్తూ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. తాజా విచారణలో ప్రజా ఆస్తులకు నష్టం కలిగించే నిబంధనలు ఈ కేసులో వర్తించవని నాంపల్లి కోర్టు అభిప్రాయపడింది. దీంతో పోలీసులు నమోదు చేసిన పలు సెక్షన్లు రద్దయ్యాయి. అయితే బీఎన్ఎస్ సెక్షన్లు 152 మరియు 353(1)(బి) కింద కేసు విచారణ కొనసాగించడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో కేసు దర్యాప్తు ఈ రెండు అభియోగాల పరిధిలోనే కొనసాగనుంది.