Collector Pamela: ఈ కలెక్టర్ స్ఫూర్తి.. ఎందరికో ఆదర్శం!
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి రెండేళ్ల 11 నెలల వయసున్న కుమారుడు ఉన్నాడు. ఆమె తలుచుకుంటే.. రాష్ట్రంలోని నంబర్ వన్ ప్లే స్కూళ్లో అతనికి అడ్మిషన్ చాలా సులభంగా లభిస్తుంది.
- By Balu J Published Date - 12:13 PM, Fri - 4 February 22

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి రెండేళ్ల 11 నెలల వయసున్న కుమారుడు ఉన్నాడు. ఆమె తలుచుకుంటే.. రాష్ట్రంలోని నంబర్ వన్ ప్లే స్కూళ్లో అతనికి అడ్మిషన్ చాలా సులభంగా లభిస్తుంది. కానీ ఆమె తన అధికారాన్ని ఆ విధంగా ఉపయోగించాలనుకోలేదు. అందరి పిల్లల్లా తన కుమారుడిని కూడా అంగన్ వాడీ కేంద్రానికి పంపించాలని నిర్ణయించారు. కలెక్టర్ పమేలా సత్పతి తన 36 నెలల వయసున్న కుమారుడు నైతిక్ సత్పతి పేరును అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేయించారు. ఇందుకుకుగాను అంగన్ వాడీ కేంద్రం 16 గుడ్లు, బాలామృతాన్ని కలెక్టర్‌కు అందజేశారు.
కుటుంబ నేపథ్యం
పమేలా సత్పతి కోరాపుట్ జిల్లాలోని సునాబెడలో పుట్టి పెరిగారు. ఆమె డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ఆఫీసర్ ఆర్. కె. సతపతి కూతురు. తన తల్లి నుంచి స్ఫూర్తిని పొంది ఉన్నత చదువులు చదవాలని నిర్ణయించుకుంది. వృత్తిరీత్యా డాక్టర్‌గా ఉంటూ ఉమ్మడి కుటుంబంలో జీవిస్తున్న దీపాంకర్‌తో ఆమె పెళ్లి చేసుకుంది పమేలా.
ఉన్నత చదువులు
కంప్యూటర్ సైన్స్‌లో బి.టెక్ పూర్తి చేసిన తర్వాత, ఆమె ఇన్ఫోసిస్‌లో మొదటి క్యాంపస్ ప్లేస్‌మెంట్ పొందింది. పమేలా సత్పతి ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు. ఆ తర్వాత దేశంలో అభివృద్ధి చెందుతున్న పరిశోధనా రంగాలలో ఒకటైన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR)లో తోటి శాస్త్రవేత్తగా చేరాలని నిర్ణయించుకుంది. ఆమె శిక్షా ఓ అనుసంధన్ యూనివర్సిటీ (SOAU)లో స్కూల్ ఆఫ్ నర్సింగ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కూడా పనిచేశారు.
అవమానాలు ఎదుర్కొని..
పమేలా సత్పతి అత్తమామలు, భర్త అందించిన ప్రోత్సాహంతో ముందుకు సాగింది. “ఆమె IPS అధికారి అయిన తర్వాత ‘నీ ప్రాధాన్యం బాగా తగ్గిపోతుంది’ అని స్నేహితులు, పరిచయస్తుల నుంచి ఎన్నో అవహేళనలు ఎదుర్కొన్నాడు పమేలా భర్త. కానీ అతను అలాంటి వాటిని ఎప్పుడూ పట్టించుకోలేదు. ‘‘నేను పరీక్షలకు సిద్ధం కావడానికి ఇంట్లో పాత్రలను శుభ్రం చేయడంతో సహా అన్ని ఇంటి పనులను చేశాడు” అని పమేలా చెప్పారు. ఈ సమయంలో ఆమె తల్లిదండ్రులు, భర్త, అత్తమామలు ఆమెకు చాలా మద్దతు ఇచ్చారు.
అభివృద్ధిపై చెరగని ముద్ర
పమేలా సత్పతి కొన్నాళ్లు వరంగల్ మున్సిపల్ కమిషనర్ గా పనిచేశారు. 2019 డిసెంబర్‌లో వరంగల్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సత్పతి నగరాభివృద్ధిపై చెరగని ముద్రవేశారని చెప్పాలి. ఆమె ముక్కుసూటితనం అనేక సార్లు ఆమెను రాజకీయ ఒత్తిళ్లకు గురయ్యారు. 2015 సంవత్సరంలో ఐఏఎస్ పూర్తి చేసుకున్న పమేలా సత్పతి తొలి పోస్టింగ్ భద్రాచలం సబ్ కలెక్టర్‌గా నియమితులయ్యారు. అక్కడ ఆమె 19 నెలల పాటు పనిచేశారు. మూడు నెలల పాటు భద్రాచలం దేవస్థానం కార్యనిర్వాహణాధికారిగానూ కొనసాగడం గమనార్హం. ఆ తర్వాత 11నెలలు భూసేకరణ శాఖలో పని చేశారు. ఆ తర్వాత యాదాద్రి భువనగిరి కలెక్టర్ గా నియమితులై సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.