Tandur Govt Hospital : సీఎం రేవంత్ ఇలాకాలో దారుణం
Tandur Govt Hospital : సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ ఆసుపత్రి(Tandur Govt Hospital)లో నిండు గర్భిణీ అఖిల (23) ప్రాణాలు కోల్పోవడం ప్రజలను కలచివేసింది
- By Sudheer Published Date - 01:31 PM, Mon - 22 September 25

తెలంగాణ రాష్ట్రంలో వైద్య రంగంలో చోటుచేసుకుంటున్న నిర్లక్ష్య ఘటనలు మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ ఆసుపత్రి(Tandur Govt Hospital)లో నిండు గర్భిణీ అఖిల (23) ప్రాణాలు కోల్పోవడం ప్రజలను కలచివేసింది. పురిటినొప్పులతో ఆస్పత్రికి చేరుకున్న ఆమెకు మొదట నార్మల్‌గా ఉందని వైద్యులు చెప్పి, గంటలోనే పరిస్థితి విషమించిందని బలవంతంగా డిశ్చార్జ్ చేశారు. ఆ సమయంలో తల్లి, బిడ్డ ఇద్దరూ మృతి చెందారు. ఇటువంటి నిర్లక్ష్యం ప్రసవాల విషయంలో ఉత్తమ అవార్డు పొందిన ఆస్పత్రిలో చోటుచేసుకోవడం మరింత తీవ్రతరం అయింది. దీంతో బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగుతూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
BIG BREAKING: దసరా పండుగకు సింగరేణి కార్మికులకు భారీ బోనస్
ఇక వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కూడా వైద్య సిబ్బందుల తప్పిదం రోగి ప్రాణాలను ముప్పులోకి నెట్టింది. కాజీపేట మండలం అయోధ్యపురానికి చెందిన జ్యోతి అనే మహిళ రక్తహీనత సమస్యతో చేరగా, ఆమెకు సరైన రక్త గ్రూప్ గుర్తించక పొరపాటున ‘బీ పాజిటివ్’ రక్తం ఎక్కించారు. వాస్తవానికి ఆమెకు అవసరమైంది ‘ఓ పాజిటివ్’. ఈ నిర్లక్ష్యం కారణంగా ఆమె పరిస్థితి విషమించి, వైద్యులు కూడా చేతులెత్తేశారు. ఇంత పెద్ద ఆసుపత్రిలో రక్త మార్పిడి విభాగం లేకపోవడం, రోగిని నిమ్స్‌కి తరలించాలన్న వైద్యుల సూచన కుటుంబాన్ని మరింత ఆందోళనకు గురిచేసింది. భర్త రాజు డాక్టర్లను వేడుకుంటూ తన భార్యను కాపాడాలని కన్నీరు మున్నీరయ్యాడు.
ఈ రెండు సంఘటనలు రాష్ట్ర వైద్య రంగంలోని లోపాలను బహిర్గతం చేస్తున్నాయి. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ఆసుపత్రులే నిర్లక్ష్యానికి కేంద్రాలుగా మారడం ఆందోళనకరం. ప్రసూతి విభాగంలో అనుభవజ్ఞులైన వైద్యులు లేకపోవడం, రక్త బ్యాంకులు, ట్రాన్స్‌ఫ్యూషన్ విభాగాలు సక్రమంగా పనిచేయకపోవడం వంటి లోపాలే ఈ మరణాలకు కారణమని ప్రజలు ఆరోపిస్తున్నారు. నిర్లక్ష్యం వహించిన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే సామాన్య ప్రజలకు ఆసుపత్రులపై నమ్మకం పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది.