Fake Vehicle Insurance : నకిలీ వెహికల్ ఇన్సూరెన్స్ పత్రాలకు చెక్.. త్వరలో ఆ పద్ధతి ?
Fake Vehicle Insurance : నకిలీ వెహికల్ ఇన్సూరెన్స్ పత్రాల చలామణికి అడ్డుకట్ట వేయడంపై తెలంగాణ రవాణా శాఖ ఫోకస్ పెట్టింది.
- By Pasha Published Date - 08:41 AM, Mon - 5 February 24

Fake Vehicle Insurance : నకిలీ వెహికల్ ఇన్సూరెన్స్ పత్రాల చలామణికి అడ్డుకట్ట వేయడంపై తెలంగాణ రవాణా శాఖ ఫోకస్ పెట్టింది. ఏటా ఫిట్‌నెస్ టెస్టుకు వచ్చే టైంలో వాహనదారులు వెహికల్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే దీన్ని తప్పించుకునేందుకు కొందరు నకిలీ వాహన బీమా పత్రాలను క్రియేట్ చేయిస్తున్నారు. వాటినే చూపించి బ్రోకర్ల సాయంతో తప్పించుకుంటున్నారు. దీంతో ఆ నకిలీ వెహికల్ ఇన్సూరెన్స్ పేపర్లతోనే ఏడాదంతా రోడ్లపై తిరిగేందుకు లైన్ క్లియర్ అవుతోంది. ఇలాంటి నకిలీ వెహికల్ ఇన్సూరెన్స్ పేపర్లు కలిగిన వాళ్లు వాహనాలు నడుపుతూ ఏదైనా యాక్సిడెంట్ చేసిన సందర్భాల్లో బాధిత కుటుంబాలకు సాయం దొరికే పరిస్థితి ఉండటం లేదు. ఒకవేళ సరైన వెహికల్ ఇన్సూరెన్స్ పత్రాలు ఉండి ఉంటే.. ప్రమాదం జరిగిన సందర్భాల్లో ఇటు వాహనదారుడికి, అటు ప్రమాదానికి గురైన వ్యక్తికి కొంత చేయూత లభిస్తుంది. కొందరు వాహనదారులైతే కనీసం థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్ కూడా చేయించుకోవడం లేదు.
ఐఆర్‌డీఏ గైడ్ లైన్స్‌కు అనుగుణంగా..
ఇన్సూరెన్సు రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్‌డీఏ) గైడ్ లైన్స్‌కు అనుగుణంగా వాహనదారులు నడుచుకునేలా చేయాలని రవాణా శాఖ యోచిస్తోంది. ఈ దిశగా త్వరలో చర్యలు తీసుకుంటారని సమాచారం. ఇందులో భాగంగా ఫిట్‌నెస్ టెస్టు కోసం స్లాట్ బుక్ చేసుకునే దశలోనే వెహికల్ ఇన్సూరెన్సు నంబరును ఎంటర్ చేయాలనే నిబంధనను అమల్లోకి తేవాలని భావిస్తున్నారు. అంటే ఇకపై వెహికల్ ఇన్సూరెన్స్ లేని వారికి స్లాట్ బుకింగ్ కష్టమేనన్న మాట. ఆటోలు, కార్లు, బస్సులు, స్కూళ్ల వ్యాన్లు ప్రతి సంవత్సరం ఫిట్‌నెస్ టెస్టుకు వచ్చే టైంలో తప్పనిసరిగా వెహికల్ ఇన్సూరెన్స్ పత్రాలను(Fake Vehicle Insurance) సబ్మిట్ చేయాలి. చాలా మంది దీన్ని తప్పించుకునేందుకు అడ్డదారులు తొక్కడాన్ని నిలువరించాలని పట్టుదలతో రవాణా శాఖ ఉంది.
We’re now on WhatsApp. Click to Join
వెహికల్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలివీ..
దురదృష్టవశాత్తు వాహన బీమాను క్లెయిం చేసుకునే అవసరం అంటూ వస్తే అతి తక్కువ ఖర్చుతో వాహనాన్ని తిరిగి పొందేలా జాగ్రత్త పడాలి. బీమా సౌకర్యం అటు ప్రమాదాలకు, ఇటు చోరీకి గురైన వాహనాలకూ వర్తిస్తుంది. చిన్నపాటి ప్రమాదాల నుంచి పెద్ద ప్రమాదాల వరకు సరిపోయేలా కవరేజ్ తీసుకోవాలి. ముఖ్యంగా ‘బంపర్ టు బంపర్ కవరేజ్’ ఉండటం చాలా ముఖ్యం. కొన్ని పాలసీలలో ఇలాంటి వెసులుబాటు ఉండదు. ప్రీమియం కొంచెం ఎక్కువ అయినా ఏడాదికి కనీసం రెండు సార్లు క్లెయిం చేసుకునే అవకాశం ఉన్న పాలసీ తీసుకోవడం మేలు. ఏటా వాహనం విలువతోపాటు కవరేజ్ కూడా తగ్గుతుంది. ఈ విషయంలో తగిన రైడర్ చూసుకుని పాలసీ తీసుకోవాలి. కొన్ని బీమా పాలసీల్లో దెబ్బతిన్న భాగాలకు కేవలం 50 శాతం మాత్రమే పాలసీ ద్వారా అందుతుంది. మిగిలిన మొత్తం పాలసీదారు చెల్లించాలి.ఇలాంటి విషయాల్లో జాగ్రత్త పడితే ఏదైనా అనుకోని ఘటనలు జరిగినప్పుడు అతి తక్కువ ఖర్చుతో బయటపడవచ్చు.
Also Read : AI Songs : ఏఐతో ‘లాల్ సలామ్’ పాటలు.. బాలు గొంతుతో పాడించమంటున్నారన్న రెహమాన్
థర్డ్ పార్టీ బీమా ఏమిటి ?
థర్డ్ పార్టీ బీమా అంటే మన వాహనం వల్ల ఇంకొక వాహనానికి లేదా వ్యక్తికి జరిగిన నష్టాన్ని సదరు బీమా పాలసీ భరిస్తుంది. భారతీయ మోటార్ వాహన చట్టం ప్రకారం కార్ లాంటి పెద్ద వాహనాలకు థర్డ్ పార్టీ బీమా తప్పనిసరి. కార్ విక్రయించే సమయంలో డీలర్లు ఈ అంశాన్ని పరిగణించి రిజిస్ట్రేషన్ ఖర్చుతో కలిపి బీమా ప్రీమియం కూడా కార్ ఓనర్ దగ్గర తీసుకుంటారు. ఈ బీమా పాలసీదారు సొంత వాహనానికి జరిగిన నష్టానికి వర్తించదు. అందుకే సొంత వాహనానికి కలిగే నష్టాన్ని భరించేందుకు ప్రత్యేకంగా ఒక బీమా తీసుకోవాలి.ట్రాఫిక్ పోలీసులు కార్ పత్రాలు తనీఖీ చేసే సమయంలో రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, ఎమిషన్ సర్టిఫికెట్ కాకుండా ఈ రెండు పత్రాలు కచ్చితంగా చూపించాలి.అందువల్ల ప్రమాదాల పరంగా మాత్రమే కాకుండా ట్రాఫిక్ అపరాధ రుసుం లేకుండా ఉండేందుకు థర్డ్ పార్టీ బీమా, సొంత వాహన బీమా రెండూ తప్పకుండా తీసుకోవాలి.