Benzine Bells : హైదరాబాద్లో ‘బెంజీన్’ డేంజర్ బెల్స్.. ఎంత అనర్ధమో తెలుసా ?
Benzine Bells : గ్రేటర్ హైదరాబాద్‌లో ‘బెంజీన్’ భూతం కోరలు చాస్తోంది.
- By Pasha Published Date - 07:43 AM, Mon - 5 February 24

Benzine Bells : గ్రేటర్ హైదరాబాద్‌లో ‘బెంజీన్’ భూతం కోరలు చాస్తోంది. నగరంలోని వాతావరణంలో ఈ రసాయన మూలకం మోతాదు కొన్ని ప్రాంతాల్లో సాధారణ స్థాయిని మించుతోంది. దీనివల్ల క్యాన్సర్, గుండెపోటు, రక్తహీనత, టీబీ వంటి వ్యాధులు ప్రబలే రిస్క్ ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి ఘనపు మీటరు గాలిలో 5 మైక్రో గ్రాములకు మించి ‘బెంజీన్’ ఉండకూడదు. గతేడాది డిసెంబర్ నాటికి హైదరాబాద్‌లోని హెచ్‌సీయూలో ఇది 7.95కి చేరింది. గతేడాది మే నాటికి పాశమైలారంలో 10.25కి, గతేడాది ఫిబ్రవరి నాటికి జూపార్కు ఏరియాలో 6.73కు బెంజీన్ మోతాదు చేరిందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) వార్షిక నివేదికలో ప్రస్తావించారు. పారిశ్రామికవాడల్లో విడుదల చేస్తున్న వాయువుల్లో బెంజీన్(Benzine Bells) కూడా ఉంటుందని చెప్పడానికి పాశమైలారంలోని వాతావరణంలో దాని మోతాదు 10.25గా నమోదవడమే నిదర్శనం. ప్రతినెలా హైదరాబాద్‌లో 25వేల కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. 15ఏళ్లకు మించిన వాహనాలు కూడా పెద్దసంఖ్యలో తిరుగుతున్నాయి. దీంతో వాతావరణంలో బెంజీన్ మోతాదు పెరుగుతోంది.
We’re now on WhatsApp. Click to Join
బెంజీన్ అంటే ఏమిటి?
బెంజీన్ అంటే ముడి చమురు, గ్యాసోలిన్, సిగరెట్ పొగ నుంచి ఉత్పత్తి అయ్యే రంగులేని, లేత పసుపు రసాయనం. ఇది ఆవిరి రూపంలో గాలిలో కరిగిపోతుంది. కొన్ని పరిశ్రమలలో ఇతర రసాయనాల తయారీకి కూడా బెంజీన్‌ను వాడుతుంటారు. దీనికి మండే స్వభావమూ అధికమే. ఈ మూలకం విచ్ఛినమవడానికి 10 నుంచి 30 ఏళ్లు పడుతుంది. అంటే వాతావరణంలో సుదీర్ఘకాలం దీని ప్రభావం ఉంటుంది. ఇది గాలి ప్రవాహం ద్వారా ఒక చోటు నుంచి మరో చోటుకు తరలివెళ్తుంది. వాహనాలు, గ్యాస్ స్టేషన్లు, పరిశ్రమలు, పొగాకు నుంచి ఇది రిలీజ్ అవుతుంది. జిగురు, పెయింట్, డిటర్జెంట్‌లలో కూడా ఇది ఉంటుంది.
Also Read :Uttarakhand – UCC : యూసీసీ డ్రాఫ్ట్‌కు ఉత్తరాఖండ్ మంత్రివర్గం పచ్చజెండా.. 6న అసెంబ్లీకి బిల్లు!
ఆరోగ్యంపై ఎఫెక్ట్ ఇదీ..
బెంజీన్‌ను చాలా నెలల పాటు గాలి నుంచి పీలిస్తే.. అది శరీరంలోకి చేరి ఊపిరితిత్తుల క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్‌లకు దారితీస్తుంది. శరీరంలో ఆక్సిజన్ తగినంతగా సరఫరా కాకపోవడంతో శ్వాసకోశ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి. బెంజీన్‌ను ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు పీలిస్తే ఎముక మజ్జను ప్రభావితం చేస్తుంది. దీని వల్ల ఎర్ర రక్తకణాలు తగ్గి రక్తహీనత ఏర్పడుతుంది. స్త్రీలలో సంతానోత్పత్తి దెబ్బతింటుంది. ఋతుక్రమం సక్రమంగా జరగకపోవడం, అండాశయాల పరిమాణం కూడా తగ్గుతుంది.