Bird Walk: పదండి.. పక్షుల లోకంలో విహరిద్దాం..!
తరచిచూడాలే కానీ.. మన చుట్టూ ఎన్నో అందమైన పర్యాటక ప్రదేశాలు ఉంటాయి. పక్షుల కోసం, వివిధ రకాల వన్యప్రాణులను చూసేందుకు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మన తెలంగాణలోనే హాయిగా వీక్షించవచ్చు.
- By Balu J Published Date - 03:32 PM, Thu - 6 January 22

తరచిచూడాలే కానీ.. మన చుట్టూ ఎన్నో అందమైన పర్యాటక ప్రదేశాలు ఉంటాయి. పక్షుల కోసం, వివిధ రకాల వన్యప్రాణులను చూసేందుకు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మన తెలంగాణలోనే హాయిగా వీక్షించవచ్చు. దట్టమైన అడవులు.. అందమైన కొండలు.. జలపాతాల జోరు.. అరుదైన పక్షులు, వన్య ప్రాణులతో ఆహ్వానం పలుకుతోంది ఆసిఫాబాద్ జిల్లా. ఇక్కడి అడవులు అందమైన ప్రకృతికి నిలయంగా మారుతున్నాయి. లాంగ్ బిల్డ్ రాబందు, సాధారణ కింగ్‌ఫిషర్, ఇండియన్ రోలర్, అముర్ ఫాల్కన్, రోజ్ రింగర్, పారాకీట్ వంటి వివిధ రకాల పక్షులు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. అందుకే పక్షి ప్రేమికుల కోసం జీవవైవిధ్య పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు అటవీశాఖ అధికారులు విహరయాత్రకు ప్లాన్ చేస్తోంది. ఆ యాత్ర పేరే బర్డ్ వాక్
250 పక్షి జాతులు
తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు అడవుల్లో పక్షుల ఆవాసాలు చూడొచ్చు. దేశంలో అంతరించిపోయే స్థితిలో ఉన్న పొడుగు ముక్కు రాబంధుల ఆవాసమైన పాలరాపుగుట్టతో సహా ఎంపిక చేసిన 21 ప్రాంతాల్లో ఈ బర్డ్ వాక్ జరగనుంది. సిర్పూర్, బెజ్జూరు, పెంచికల్‌పేట, మంచిర్యాల జిల్లా జన్నారం అడవుల్లో ఎన్నో అరుదైన పక్షులున్నాయి. 250పక్షి జాతులు సందర్శకులను కనువిందు చేయనున్నాయి. ఇప్పటికే కర్ణాటక, నాగ్‌పూర్, చంద్రాపూర్, హైదరాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ తదితర ప్రాంతాల నుంచి వన్యప్రాణి, ప్రకృతి ప్రేమికులు, వైల్డ్ ఫొటోగ్రాఫర్లు తమ ఆసక్తిని చూపించారు
బర్డ్ వాక్
ఈ నెల 8, 9వ తేదీల్లో ఆసిఫాబాద్ జిల్లా అడవుల్లో అధికారులు బర్డ్‌వాక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు రేపు (జనవరి 7న) సాయంత్రం కాగజ్‌నగర్‌లోని ఎఫ్‌డీవో కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఆసిఫాబాద్ డీఎఫ్‌వో 9440810099, ఎఫ్‌డీవో 9502600496 సంప్రదించాలని అటవీశాఖ సూచించింది.