SLBC : 33 రోజులకు మరో మృత దేహం లభ్యం
SLBC : రెస్క్యూ బృందాలు మినీ హిటాచితో మట్టి తవ్వుతున్న సమయంలో మనోజ్ కుమార్ మృతదేహం బయటపడింది
- By Sudheer Published Date - 03:54 PM, Tue - 25 March 25

నాగర్ కర్నూల్ జిల్లా ఎస్ఎల్బీసీ (SLBC) టన్నెల్ ప్రమాదంలో మరొక మృతదేహం (Dead Body) 33 రోజుల తర్వాత లభ్యమైంది. ఈ మృతదేహం ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రాజెక్ట్ ఇంజనీర్ మనోజ్ కుమార్ (Engineer Manoj Kumar) గా రెస్క్యూ బృందాలు గుర్తించారు. కన్వేయర్ బెల్ట్‌కు 50 మీటర్ల దూరంలో, టీబీఎం మిషన్ శకలాల కింద ఆయన మృతదేహం గుర్తించబడింది. ఫిబ్రవరి 22న జరిగిన ఈ ఘోర ప్రమాదంలో మొత్తం ఎనిమిది మంది కార్మికులు, ఇంజనీర్లు, మిషన్ ఆపరేటర్లు చిక్కుకుపోయారు. ఇప్పటి వరకు రెండు మృతదేహాలు మాత్రమే వెలికితీయగా, మిగిలిన ఆరుగురి ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
New Ministers : మంత్రివర్గ విస్తరణ.. ఏప్రిల్ 3న కొత్త మంత్రుల ప్రమాణం ?
రెస్క్యూ బృందాలు మినీ హిటాచితో మట్టి తవ్వుతున్న సమయంలో మనోజ్ కుమార్ మృతదేహం బయటపడింది. ఇంతకాలం శకలాల కింద ఉండటంతో, ఆ ప్రాంతంలో తీవ్ర దుర్వాసన వ్యాపించింది. అందువల్ల మిగిలిన ఆరుగురి మృతదేహాలు కూడా అదే ప్రదేశంలో ఉండే అవకాశం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగిన నాటి నుంచి మూడు షిఫ్టులుగా నిత్యం అన్వేషణ కొనసాగుతూనే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అనేక విభాగాల రెస్క్యూ బృందాలు అప్రమత్తంగా పని చేస్తున్నాయి. ఇక ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు తమవారు బతికే ఉన్నారనే ఆశలు వదులుకుని, కనీసం మృతదేహాలు తమకు అప్పగించాలని కోరుతున్నారు. రెస్క్యూ బృందాలు టన్నెల్ లోపల భారీగా పేరుకున్న మట్టిని తొలగించి మిగిలిన మృతదేహాలను వెలికితీసేందుకు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.