Ande Sri Passes Away : అందెశ్రీ మరణానికి కారణం ఆ నిర్లక్ష్యమే!!
Ande Sri Passes Away : గాంధీ ఆస్పత్రి వైద్యుల ప్రకారం..హార్ట్ స్ట్రోక్ వల్లే ఆయన ప్రాణాలు కోల్పోయారు. గత 15 ఏళ్లుగా హైపర్ టెన్షన్‌తో బాధపడుతూ, ఇటీవల నెలరోజులుగా మందులు తీసుకోవడం మానేశారు. మూడు రోజులుగా అనారోగ్యంగా
- By Sudheer Published Date - 11:46 AM, Mon - 10 November 25
తెలంగాణ రాష్ట్ర గీతం “జయ జయహే తెలంగాణ” రచయిత, ప్రముఖ కవి, ప్రజాగేయకారుడు అందెశ్రీ ఇక లేరు. ఆదివారం తెల్లవారుజామున లాలాగూడలోని తన నివాసంలో ఆయన కుప్పకూలి మరణించారు. కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించినా, వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. గాంధీ ఆస్పత్రి వైద్యుల ప్రకారం..హార్ట్ స్ట్రోక్ వల్లే ఆయన ప్రాణాలు కోల్పోయారు. గత 15 ఏళ్లుగా హైపర్ టెన్షన్‌తో బాధపడుతూ, ఇటీవల నెలరోజులుగా మందులు తీసుకోవడం మానేశారు. మూడు రోజులుగా అనారోగ్యంగా ఉన్నప్పటికీ ఆస్పత్రికి వెళ్లకపోవడం, ఆరోగ్యంపై నిర్లక్ష్యం చూపడం ఆయన మరణానికి కారణమైందని వైద్యులు తెలిపారు. తెల్లవారుజామున కుటుంబ సభ్యులు ఆయనను బాత్‌రూమ్ వద్ద పడిపోయి ఉండగా గుర్తించారు.
Hyderabad : హైదరాబాద్ అడ్డాగా ఉగ్రకుట్రకు ప్లాన్
అందెశ్రీ మృతి వార్తతో తెలంగాణ సాహితీ, రాజకీయ రంగాలన్నీ దుఃఖసముద్రంలో మునిగిపోయాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పలువురు ప్రముఖులు ఆయన మరణంపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు రాష్ట్ర అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర గీత రచయితగా, సాంస్కృతిక ఉద్యమానికి ఆత్మను ఇచ్చిన మహానుభావుడిగా అందెశ్రీని రాష్ట్రం స్మరించుకుంటోంది. ఉద్యమ దశలో ఆయన పాటలు ప్రజల్లో చైతన్యం నింపి, తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేయడంలో కీలక పాత్ర పోషించాయి. ఆయన మరణం రాష్ట్ర సాహిత్య రంగానికి తీరని లోటుగా మిగిలిపోనుంది.
జీవితాన్ని గొర్రెల కాపరిగా ప్రారంభించి, బడి చూడకుండానే ప్రజాకవిగా ఎదిగిన అందెశ్రీ జీవితమే ఒక స్ఫూర్తి. “మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు”, “జయ జయహే తెలంగాణ” వంటి ఆయన రచనలు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయాయి. తెలంగాణ నేల నాడి తాళాన్ని తన పద్యాల్లో మోసుకువచ్చిన ఈ మహానుభావుడి సాహిత్యం ప్రజల భావోద్వేగాలకు ప్రతిబింబంగా నిలిచింది. కాకతీయ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయడం, ఆయన ప్రతిభకు లభించిన విశిష్ట గుర్తింపు. అందెశ్రీ లేని లోటు తెలంగాణ సాహిత్య చరిత్రలో ఎప్పటికీ నిండనిది.