T-SAT : ఇకపై టీసాట్లో వ్యవసాయ ప్రసారాలు
T-SAT : ప్రతి సోమవారం, శనివారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు టీసాట్ నిపుణ ఛానల్లో వ్యవసాయంపై ప్రత్యేక ప్రసారాలు ఉంటాయని తెలిపారు
- By Sudheer Published Date - 10:33 AM, Mon - 16 December 24

T-SAT : విద్య, ఉపాధి, పోటీ పరీక్షల కంటెంట్ అందించే ప్రముఖ సంస్థగా T-SAT ఎంతో గుర్తింపు ఉంది. ఇప్పుడు కొత్తగా వ్యవసాయ రంగానికి (Agriculture Sector) సంబంధించి ప్రసారాలను అందుబాటులోకి తీసుకరాబోతుంది. టీసాట్ సీఈవో వేణుగోపాల్ రెడ్డి (TSAT CEO Venugopal Reddy)ఇటీవల ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నూతన కార్యక్రమం ద్వారా రైతులకు సమయానుకూల సమాచారం, ఆధునిక సాంకేతికతలపై అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశంగా ఆయన పేర్కొన్నారు.
ప్రతి సోమవారం, శనివారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు టీసాట్ నిపుణ ఛానల్లో వ్యవసాయంపై ప్రత్యేక ప్రసారాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పంటల సాగు, వ్యవసాయ సాంకేతికతలు, మార్కెట్‌కు సంబంధించిన వివరాలను అందించనున్నారు. రైతులు ఈ ప్రసారాలను ఉపయోగించుకుని వ్యవసాయ రంగంలో ఆచరణాత్మక మార్పులు చేయవచ్చని వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ప్రత్యేకంగా హార్టికల్చర్ (ఉద్యానవనం) పై ప్రసారాలను అందిస్తామని తెలిపారు. పూలు, పండ్లు, కూరగాయల సాగుపై నిపుణుల సూచనలు, సమగ్ర సమాచారం ఈ కార్యక్రమాల్లో పొందుపరుస్తారు. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు పొందే పద్ధతులపై వివరాలు అందించనున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, సంబంధిత అధికారులు, అనుభవజ్ఞులైన రైతులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని సలహాలు ఇస్తారని వేణుగోపాల్ రెడ్డి వెల్లడించారు. పంటల సమస్యలు, వాటి పరిష్కారాలు, వ్యవసాయ రంగంలో కొత్త ఆవిష్కరణలపై నిపుణుల సందేహ నివృత్తి సెషన్ కూడా ప్రసారంలో భాగంగా ఉంటుంది.
ఈ ప్రోగ్రామ్స్ ద్వారా టీసాట్ ప్రతిష్ఠను మరింత పెంచడంతో పాటు, వ్యవసాయ రంగంలో కొత్తదనాన్ని తీసుకురావడంలో కీలకంగా ఉంటుందని భావిస్తున్నారు. రైతులు ఇంటి వద్ద నుంచే ప్రసారాలను వీక్షించి, ఆధునిక పద్ధతులను అనుసరించవచ్చు. టీసాట్ ఈ ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం రైతుల అభివృద్ధికి కీలక ముందడుగు వేయబోతుంది.
Read Also : Hyderabad Metro Phase-II: MGBS-చాంద్రాయణగుట్ట మార్గంలో భూసేకరణ వేగవంతం