Vote From Home : వృద్ధులు, దివ్యాంగులు ఇక ఇంటి నుంచే ఓటు వేయొచ్చు
Vote From Home : ఈ ఎలక్షన్ల నుంచి వృద్ధులు, దివ్యాంగులు ఇంటి నుంచే ఓటు వేయొచ్చు.
- By Pasha Published Date - 02:01 PM, Tue - 10 October 23

Vote From Home : ఈ ఎలక్షన్ల నుంచి వృద్ధులు, దివ్యాంగులు ఇంటి నుంచే ఓటు వేయొచ్చు. 80 ఏళ్లు దాటిన వృద్ధులు, 40 శాతానికి మించిన అంగవైకల్యం కలిగిన వారు ఇంటి నుంచే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయొచ్చు. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం నామినేషన్ల దాఖలు ప్రారంభానికి 5 రోజుల ముందే ఎన్నికల అధికారులకు 12డీ దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. పోలింగ్ కేంద్ర స్థాయి అధికారి అర్హులందరి ఇళ్లకు వెళ్లి.. ఆసక్తి చూపితే 12డీ దరఖాస్తు చేయిస్తారు. ఈ దరఖాస్తులను నియోజకవర్గ అధికారి ఆమోద ముద్రతో పోస్టల్ బ్యాలెట్ ముద్రణ కోసం ఎన్నికల సంఘానికి పంపుతారు.
We’re now on WhatsApp. Click to Join
పోలింగ్ తేదీ కన్నా ముందే, పోలింగ్ కేంద్ర స్థాయి అధికారి బ్యాలెట్ పత్రాలు, సంబంధిత కవర్లతో ఓటర్ల ఇంటికి వెళ్తారు. అక్కడ ఓటరు రహస్యంగా తన ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రత్యేక కంపార్టుమెంట్ ఏర్పాటు చేస్తారు. ఈ ఓట్ల కవర్లను స్ట్రాంగ్ రూంలో భద్రపరిచి, పోస్టల్ ఓట్లతో కలిపి లెక్కిస్తారు. ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యాన్ని వినియోగించుకునే ఓటర్ల వివరాలను రాజకీయ పార్టీలు, నియోజకవర్గ అభ్యర్థులకు ముందుగానే ఎన్నికల అధికారులు అందజేస్తారు. పార్టీల, అభ్యర్థుల ప్రతినిధుల సమక్షంలోనే జరిగే ఈ ప్రక్రియను వీడియో షూట్ చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో 80 ఏళ్లు దాటిన వారు 4.43 లక్షల మంది ఉన్నారు. దివ్యాంగ ఓటర్లు 5.06 లక్షల మంది ఉన్నారు. రాష్ట్రంలో నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు (Vote From Home) ఉంటుంది.