Jack Ma: అపర కుబేరుడు అయిన జాక్ మా.. జీవితంలో అన్ని కష్టాలను ఎదుర్కొన్నాడా?
ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరైన జాక్ మా గురించి మనందరికీ తెలిసిందే. చైనాకు చెందిన గొప్ప పారిశ్రామిక వేత్తగా మాత్రమే కాకుండా ఆలీబాబా కామ్ ఈ-క
- By Anshu Published Date - 06:45 PM, Fri - 23 June 23

ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరైన జాక్ మా గురించి మనందరికీ తెలిసిందే. చైనాకు చెందిన గొప్ప పారిశ్రామిక వేత్తగా మాత్రమే కాకుండా ఆలీబాబా కామ్ ఈ-కామర్స్ పోర్టల్ అధినేతగా కూడా జాక్ అందరికీ సుపరిచితమే. 1964 సెప్టెంబర్ 15న జన్మించిన జాక్ ఒక దిగువ మధ్య తరగతికి కుటుంబానికి చెందిన వ్యక్తి. చిన్నప్పటి నుంచే ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న ఇతడు అతిథులతో సంభాషించడానికి ప్రతిరోజూ ఉదయం సమీపంలో ఉన్న హోటల్‌కు సైకిల్ మీద వెళ్లేవాడు.
ఇంగ్లీష్ మీద పట్టు సాధించాలనే ఉద్దేశ్యంతో గైడ్‌గా కూడా పనిచేసేవాడు. ఇది తన నైపుణ్యాన్ని మెరుగు పరుచుకోవడానికి అదో అద్భుత అవకాశంగా భావించి అలా చేసేవాడు జాక్.
అలా దాదాపుగా 9 సంవత్సరాలు గైడ్‌గా పనిచేసి ఎంతో నేర్చుకున్నాడు. గురువుల దగ్గర, పుస్తకాల్లోనూ నేర్చుకున్న వాటికి భిన్నమైన అంశాలను విదేశీ పర్యటకుల నుంచి గ్రహించగలిగాడు. అలా ఇంగ్లీష్ లెక్షరర్ కావాలనే కోరికతో హాంగ్‌జౌ డియాంజీ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష రాశాడు. ఈ ఎంట్రన్స్ టెస్ట్‌లో రెండు సార్లు ఫెయిల్ అయ్యాడు. అయినా కూడా పట్టు వదలకుండా మూడవ సారి పరీక్ష రాసి విజయం సాధించాడు. అదే సమయంలో యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా ఎన్నికయ్యాడు. చదువు పూర్తయ్యాక అదే విశ్వవిద్యాలయంలో నెలకు సుమారు రూ.1000 జీతానికి పాఠాలు చెప్పేవాడట. అక్కడ జీతం సరిపోకపోవడంతో అనేక ఉద్యోగాలకు అప్లై చేయగా ఏ ఒక్క ఉద్యోగానికి కూడా సెలెక్ట్ కాలేదట..
ఏ ఉద్యోగానికి ఎంపిక కాకపోవడంతో 1994లో మొదటి సంస్థ హైబో ట్రాన్స్‌లేషన్ ఏజెన్సీ స్థాపించి ఆంగ్ల అనువాదం, వివరణను అందించడం ప్రారంభించాడు. ఆ తరువాత మొదటిసారిగా యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్లే అవకాశాన్ని పొందాడు. అక్కడే అతని జీవితం మలుపు తిరిగింది. అక్కడే మొదటి సారి ఇంటర్నెట్ గురించి తెలుసుకున్నాడు. అంతర్జాలం అతనికి ఒక పెద్ద మాయగా అనిపించింది. అప్పుడు అతడు యాహూలో సెర్చ్ చేస్తుంటే చైనాకు సంబంధించిన సమాచారం ఏమి దొరకలేదు. దీన్ని అవకాశంగా తీసుకుని రూ. 1.2 లక్షల పెట్టుబడితో చైనా పేజెస్ పేరుతో వెబ్‌సైట్ ప్రారంభించాడు. అప్పటి వరకు జాక్ కీ బోర్డు తాకనేలేదు. జాక్ జీవితం ఆ తరువాత ఇంటర్నెట్‌తో ముడిపడిపోయింది.
కనీసం కీబోర్డ్ కూడా తాకని వ్యక్తి ఏకంగా చైనా టెలికామ్ సంస్థకి గట్టి పోటీ ఇవ్వగా ఆ కంపెనీ అప్పట్లోనే రూ. కోటి పెట్టుబడితో సంస్థ పెట్టి కలిసి పనిచేద్దామనీ చైనా టెలికామ్ జీఎమ్ జాక్‌కు చెప్పాడు. అదే అదనుగా చూస్తున్న జాక్ ఆ అవకాశాన్ని వదులుకోలేదు. అయితే కొన్ని రోజుల తరువాత ఆ భాగస్వామ్యం నచ్చకుండా బయటకు వచ్చేసిన ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ను ప్రారంభించాలనుకున్నాడు. 1999లో 18 మంది వ్యక్తులతో కలిసి ఆన్‌లైన్ బిజినెస్ ప్రారంభించాడు. అలీబాబా అనే పేరుని కూడా పెట్టాడు. ఈ సంస్థ కేవలం మూడు సంవత్సరాల కాలంలోనే గొప్ప వృద్ధిని సాధించింది. ఎంట్రన్స్ పరీక్షల్లోనే కస్టపడి సక్సెస్ సాధించిన జాక్ మా ఈ రోజు ప్రపంచం మెచ్చిన పారిశ్రామికవేత్తగా టాప్ 100 ధనవంతుల జాబితాలో ఒక వ్యక్తిగా నిలిచాడు. అలాగే భారీగా డబ్బులు సంపాదిస్తూ చైనాలో అత్యంత ధనవంతుడుగా నిలిచాడు. కాగా జాక్ తన స్నేహితురాలైన జాంగ్ యింగ్ ను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు.