Jwala Thoranam : ఇవాళ జ్వాలాతోరణం.. ఎలా నిర్వహిస్తారు ? ప్రాముఖ్యత ఏమిటి ?
Jwala Thoranam : ఈరోజు సాయంత్రం కార్తీక పౌర్ణమి వేళ శైవ ఆలయాల్లో జ్వాలాతోరణం అనే ప్రత్యేక ఉత్సవం నిర్వహిస్తారు.
- By Pasha Published Date - 07:38 AM, Sun - 26 November 23

Jwala Thoranam : ఈరోజు సాయంత్రం కార్తీక పౌర్ణమి వేళ శైవ ఆలయాల్లో జ్వాలాతోరణం అనే ప్రత్యేక ఉత్సవం నిర్వహిస్తారు. శివాలయాల ఎదుట రెండు కర్రలు నిలుపుగా పాతి.. ఒక కర్రను వాటికి అడ్డంగా పెడతారు. అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డిని చుడతారు. దీన్ని యమద్వారం అని పిలుస్తారు. ఈ నిర్మాణంపై నెయ్యి పోసి మంట పెడతారు. ఆ మంట కింద నుంచి పరమేశ్వరుడిని పల్లకిలో అటూఇటూ మూడుసార్లు ఊరేగిస్తారు. జ్వాలాతోరణం కింద ఈశ్వరుడి పల్లకి పక్కనే నడుస్తూ.. ‘‘మహా శివా, నేను ఇప్పటి దాకా చేసిన పాపాలన్నీ ఈ మంటల్లో కాలిపోవాలి. వచ్చే ఏడాది వరకు ఎలాంటి తప్పు చేయకుండా సన్మార్గంలో నీ బాటలోనే నడుస్తాను’’ అని ప్రతిజ్ఞ చేయాలి. జ్వాలాతోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకొచ్చి.. ఇంటి గడ్డివాములోనో, ధాన్యాగారంలోనో పెట్టడం శుభప్రదం. జ్వాలతోరణ ఘట్టాన్ని దర్శనం చేసుకుంటే సర్వపాపాలు తొలగుతాయని నమ్ముతారు. జ్వాలాతోరణ భస్మం ధరిస్తే భూత, ప్రేత, పిశాచ బాధలన్నీ తొలగిపోతాయని విశ్వసిస్తారు. కాగా, ఈరోజు శివుడి ఆలయాల్లో స్తంభాలకు గడ్డితో తోరణాలు ఏర్పాటు చేస్తారు. వాటికి నూనెలో ముంచిన వస్త్రాలను తగిలించి వెలిగిస్తారు. ఆ జ్వాలాతోరణాల చుట్టూ ఉత్సవ విగ్రహాల్ని మూడుసార్లు తిప్పుతారు.
We’re now on WhatsApp. Click to Join.
యమద్వారం చూడాల్సిన అవసరం రావద్దంటే..
జ్వాలాతోరణం ఉత్సవాన్ని ప్రవేశపెట్టడం వెనక ఓ కారణం ఉందట. యమలోకంలోకి వెళ్లిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్నితోరణం. యమలోకానికి వెళ్లిన ప్రతి వ్యక్తీ ఈ తోరణం మీదుగానే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష. ఈ శిక్షను తప్పించుకోవాలంటే ఈశ్వరుడిని ప్రార్థించాలి. అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమ ద్వారం నుంచి మూడుసార్లు అటూ ఇటూ వెళ్లి వస్తారో వారికి ఈశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. అతనికి ఇక యమద్వారాన్ని చూడాల్సిన అవసరం రాదు అని అంటారు. అందుకే ఈ జ్వాలాతోరణ మహోత్సవంలో పాల్గొనాలని పెద్దలు(Jwala Thoranam) చెబుతారు.
గమనిక: ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాన్ని వినియోగదారులు కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.