Jail for BJP MLA: మైనర్ బాలికపై అత్యాచారం కేసు.. బీజేపీ ఎమ్మెల్యేకు 25 ఏళ్లు జైలుశిక్ష
సోన్ భద్ర జిల్లా దుద్ది శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే రామ్ దులర్ గోండ్ పై 2014 నవంబర్ 4వ తేదీన పోక్సోకేసు నమోదైంది. అతని భార్య గ్రామ సర్పంచిగా..
- By News Desk Published Date - 07:36 PM, Fri - 15 December 23

Jail for BJP MLA: మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యేకు ప్రజాప్రతినిధుల కోర్టు 25 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధించింది. అత్యాచార కేసులో దోషిగా శిక్ష పడటంతో.. ఆయనపై అనర్హత వేటు పడింది. ప్రజా ప్రతినిధుల చట్టం ప్రకారం.. రెండేళ్లు, అంతకంటే ఎక్కువకాలం శిక్ష పడిన ప్రజాప్రతినిధిని అనర్హుడిగా ప్రకటిస్తారు.
వివరాల్లోకి వెళ్తే.. సోన్ భద్ర జిల్లా దుద్ది శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే రామ్ దులర్ గోండ్ పై 2014 నవంబర్ 4వ తేదీన పోక్సోకేసు నమోదైంది. అతని భార్య గ్రామ సర్పంచిగా ఉన్న సమయంలో ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేసినట్లు బాధితురాలి సోదరుడు మయోర్ పుర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన దుద్ది శాసనసభ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందగా.. ఈ కేసును ప్రజాప్రతినిధుల న్యాయస్థానానికి బదిలీ చేశారు. దానిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ అహసన్ ఉల్హాఖాన్ మంగళవారం తీర్పును రిజర్వ్ చేశారు.
మైనర్ పై అత్యాచారం కేసులో గోండ్ దోషి అని తేలడంతో.. న్యాయస్థానం 25 ఏళ్లు కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 లక్షలు జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది. కాగా.. తీర్పుకు ముందు గోండ్ కు శిక్ష తగ్గించాలని అతని తరపు న్యాయవాది విజ్ఞప్తి చేయగా.. దానిని కోర్టు కొట్టివేసింది. అలాగే బాధితురాలి కుటుంబ బాధ్యతలను తానే చూసుకుంటానని గోండ్ ఇచ్చిన హామీని కూడా కోర్టు పరిగణలోకి తీసుకోలేదు.