Electric Super Sports Bike: గంటకు 400 కిలోమీటర్ల స్పీడ్.. సూపర్ ఎలక్ట్రిక్ బైక్ రెడీ!!
ఎలక్ట్రిక్ బైక్స్ స్పీడ్ కొత్త మలుపు తీసుకోబోతోంది.. అమెరికాకు చెందిన "లైటినింగ్ మోటార్ సైకిల్స్" ఈ దిశగా విప్లవాత్మక
- By Anshu Published Date - 12:30 PM, Sun - 14 August 22
ఎలక్ట్రిక్ బైక్స్ స్పీడ్ కొత్త మలుపు తీసుకోబోతోంది.. అమెరికాకు చెందిన “లైటినింగ్ మోటార్ సైకిల్స్” ఈ దిశగా విప్లవాత్మక ఆవిష్కరణ చేయబోతోంది. ఈ కంపెనీ అభివృద్ధి చేసిన సూపర్ బైక్ “టాక్యోన్ ఎన్బీ” (Tachyon NB) స్పీడ్ ఎంతో తెలిస్తే మీరు ఆశ్చర్య పోతారు. ఇది గంటకు 400 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్లగలదు.
ఒక పెద్ద తేడా..
మిగితా బైక్స్ తయారీ కంపెనీలకు “టాక్యోన్ ఎన్బీ” కి ఒక పెద్ద తేడా ఉంది. అదేమిటంటే.. ఈ కంపెనీ బైక్స్ తయారీలో నియోబియం టెక్నాలజీ( Niobium Technology) వాడుతుంది. ఈ టెక్నాలజీని వినియోగించి.. ఎప్పుడో 1960వ దశకంలో బైక్ ప్రోటో టైప్ మోడల్ కు జీవం పోసేలా “టాక్యోన్ ఎన్బీ” బైక్ ను చూడచక్కగా, సౌకర్యవంతంగా, వేగవంతంగా తీర్చిదిద్దింది.
“ఏరో డైనమిక్ ఎఫీషియన్సీ” ఫీచర్ అదుర్స్..
ఇతర బైక్స్ లో లేని.. “టాక్యోన్ ఎన్బీ” బైక్ లో ఉన్న ఫీచర్ “ఏరో డైనమిక్ ఎఫీషియన్సీ”. సాధారణ బైక్స్ లో.. బైక్ నడుపుతున్నప్పుడు ఎదుటి నుంచి వచ్చే గాలి ఒత్తిడిని రైడర్ ఎదుర్కోవాలి. కానీ “టాక్యోన్ ఎన్బీ” లో ఆ సమస్య ఉండదు. ఎందుకంటే.. ఎదుటి నుంచి వచ్చే గాలి ఒత్తిడిని తిప్పికొట్టేందుకు ఈ బైక్ ముందు టైర్ నుంచి డోమ్ పై భాగం వరకు ఒక బలమైన ఫెన్సింగ్ ఉంటుంది. ఎదుటి నుంచి వచ్చే గాలిని ఈ ఫెన్సింగ్ నిలువరిస్తుంది. ఫలితంగా బైక్ స్పీడ్.. గాలి ఒత్తిడి ప్రభావంతో తగ్గే ఛాన్స్ ఉండదు.
విమానాల తయారీకి వాడే నియోబియంతో..
విమానాలు, వ్యోమ నౌకలు, విమాన ఇంజిన్లు వంటి వాటి తయారీకి “నియోబియం” అనే దృఢమైన లోహాన్ని వినియోగిస్తారు. ఇదే లోహంతో “టాక్యోన్ ఎన్బీ” బైక్ బాడీలోని పార్ట్స్, చాసిస్ తయారు చేశారు. ఫలితంగా బైక్ ఎంతో స్ట్రాంగ్ గా ఉంటుంది. అలా అని బరువు కూడా పెరగదు. బైక్ బరువు పెరగకపోవడం అనే ముఖ్యమైన కారణం వల్ల స్పీడ్ గణనీయంగా పెరుగుతుంది. ఇవన్నీ కలిసి ప్రపంచంలోనే అత్యంత స్పీడ్ గా (గంటకు 400 కిలోమీటర్లు) నడిచే బైక్ గా “టాక్యోన్ ఎన్బీ” ని నిలబెట్టాయని పరిశీలకులు అంటున్నారు. బైక్స్ స్పీడ్ ను టెస్ట్ చేసే గడ్డగా పేరొందిన అమెరికాలోని బోన్ విల్లే ప్రాంతంలో ఇప్పటికే టాక్యోన్ ఎన్బీ స్పీడ్ ను టెస్ట్ చేశారు. ఈ బైక్ అభివృద్ధి లో బ్రెజిల్ కు చెందిన CBMM కంపెనీ కూడా పాల్గొందని “లైటినింగ్ మోటార్ సైకిల్స్” వెల్లడించింది.