Shane Warne: షేన్ వార్న్ చనిపోవడానికి ముందు ఏం జరిగింది?
ఆయన బాల్ వేస్తే బ్యాట్స్ మెన్ కు వెన్నులో వణుకు పుడుతుంది. ఓవర్ ఓవర్ కు తిరిగే స్పిన్ తో ప్రత్యర్థులకు గ్రౌండ్ లో ముచ్చెమటలు పట్టిస్తాడు.
- By Hashtag U Published Date - 07:08 PM, Sun - 6 March 22

ఆయన బాల్ వేస్తే బ్యాట్స్ మెన్ కు వెన్నులో వణుకు పుడుతుంది. ఓవర్ ఓవర్ కు తిరిగే స్పిన్ తో ప్రత్యర్థులకు గ్రౌండ్ లో ముచ్చెమటలు పట్టిస్తాడు. అలాంటి ఫిట్ నెస్ తో శారీరకంగా బలంగా ఉండే షేన్ వార్న్ గుండెపోటుతో మరణించడం క్రికెట్ ప్రపంచాన్ని షాక్ కు గురి చేసింది. కానీ ఆయన చనిపోవడానికి ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అసలు వార్న్ చనిపోవడానికి ముందు ఏం జరిగింది?
వార్న్ ప్రాణాలు కోల్పోవడానికి ముందు ఏం జరిగిందో ఆయన మేనేజర్ జేమ్స్ ఎర్స్ కిన్ చెప్పడంతో అసలు విషయం వెలుగుచూసింది. క్రికెట్ మ్యాచ్ లో కామెంట్రీ చెప్పడానికి వార్న్.. ఇంగ్లాండ్ వెళ్లాలనుకున్నాడు. ఈలోపు కాస్త సమయం దొరకంతో థాయ్ లాండ్ కు వెళ్లాడు. అక్కడ వార్న్ చనిపోవడానికి ముందు పాకిస్తాన్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టును టీవీలో చూశాడు. ఆ టైమ్ లో మద్యం కూడా తీసుకోలేదు.
వార్న్ ఈమధ్య ఆరోగ్యంపై దృష్టి పెట్టడంతో పెద్దగా మద్యం తీసుకోవడం లేదు. హోటళ్లో తన స్నేహితుడు నియోఫిటోతో కలిసి భోజనం చేయాలని ప్లాన్ కూడా చేసుకున్నాడు. సాయంత్రం వేళ వీళ్లిద్దరూ కలిసి.. మరికొందరిని కలవడానికి అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు. వార్న్ ఉన్న రూమ్ పక్కనే మరో రూమ్ లో ఉన్నాడు నియో. ఆయన వార్న్ రూమ్ లోకి వెళ్లేసరికే… వార్న్ కదలిక లేకుండా పడి ఉన్నాడు.
షేన్ వార్న్ కి ఏదో అయ్యిందని భావించిన నియో.. తనకు తెలిసిన విధంగా సీపీఆర్ ని చేసినా ప్రయోజనం లేకపోయింది. నోటిలో నోరుపెట్టి ఆక్సిజన్ ఇవ్వడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. 20 నిమిషాలు గడిచాక అంబులెన్స్ వచ్చినా అప్పటికే ఆలస్యం అయ్యింది. చివరు ఆసుపత్రికి తీసుకువెళ్లే సమయానికే నష్టం జరిగిపోయింది. ఓ గంట గడిచిన తరువాత వార్న్ మృతి చెందినట్లుగా ప్రకటించారు.
వార్న్ ఈమధ్యే బరువు తగ్గడానికి హెవీ వర్కవుట్స్ చేస్తున్నాడు. యుక్త వయసులో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడో అలా వచ్చే జూన్ లోపు తయారవ్వాలని టార్గెట్ కూడా పెట్టుకున్నాడు. దీనికోసమే మద్యం తగ్గించాడు. ఆహార నియమాలు పాటిస్తున్నాడు. కానీ ఆయన వయసు 52 ఏళ్లు. ఈమధ్యకాలంలో ఆయన చేస్తున్న వ్యాయామాలు శరీరానికి తగ్గట్టుగా ఉన్నాయా లేదా.. ఒకవేళ మితిమీరిన వ్యాయాయమే వార్న్ ప్రాణాలను బలితీసుకుందా అని ఆయన అభిమానులు కలత చెందుతున్నారు.