Vinod Kumar: నీట్ పై తీర్మానం చేయాలి: మాజీ ఎంపీ బోయినపల్లి
- Author : Balu J
Date : 28-06-2024 - 8:33 IST
Published By : Hashtagu Telugu Desk
Vinod Kumar: ‘నీట్’పై దేశవ్యాప్తంగా నిరసనలు ఉధృతమవుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. నీట్ పేపర్ లీక్పై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ గందరగోళ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని విద్యార్థులు ఆందోళనగా, ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘నీట్’ను రద్దు చేయాలంటూ చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని తమిళనాడు అసెంబ్లీ ఆమోదించింది. ఈ నేపథ్యంలో తమిళనాడులోని ఎంకే స్టాలిన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మాజీ ఎంపీ వినోద్ స్వాగతించారు. నీట్ విషయంలో తమిళనాడు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు యావత్ దేశానికే ఆదర్శనీయంగా నిలుస్తున్నదని కొనియాడారు.
‘నీట్’పై ఇంత రాద్ధాంతం జరుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తనకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తుండటం సిగ్గుచేటని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి నీట్ రద్దు కోసం ఏకగ్రీవ తీర్మాణాన్ని ప్రవేశపెట్టాలని ఆయన సూచించారు. నీట్ ద్వారా మెడికల్ కాలేజీల్లో ఇతర రాష్ట్రాల విద్యార్థులను చేర్చుకోకుండా రాష్ట్రానికి మినహాయింపునివ్వాలని, గతం మాదిరిగానే ఎంసెట్ ఆధారంగానే మెడికల్ అడ్మిషన్లు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతినిచ్చేలా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని ఆయన కోరారు. రాష్ట్రాల విన్నపాలను కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పడితే సుప్రీంను ఆశ్రయించి, రాష్ట్రాలు తమ హక్కులను సాధించుకోవాలని ఆయన సూచించారు.