Singer Collapses On Stage: స్టేజ్‌పైనే కుప్పకూలిన ప్రముఖ గాయకుడు.. ఆస్పత్రికి తీసుకెళ్లే సరికే మృతి!!
ఒడిశాలోని జయపురంలో దసరా ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత విభావరి విషాదాంతమైంది.
- By Hashtag U Published Date - 12:34 PM, Tue - 4 October 22

ఒడిశాలోని జయపురంలో దసరా ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత విభావరి విషాదాంతమైంది. ఆ ప్రోగ్రాం లో ప్రముఖ గాయకుడు మురళీ మహాపాత్రొ (59) తన బృందంతో కలిసి వరుసగా రెండు సుమధుర గీతాలతో ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత మిగతా గాయకులు పాడుతుండగా.. స్టేజీపైనే కుర్చీ మీద కూర్చొని వారిని ప్రోత్సహించారు. ఈక్రమంలో మురళీ మహాపాత్రొ హఠాత్తుగా గుండె నొప్పితో వేదికపై ఒరిగిపోయారు. నిర్వాహకులు, తోటి కళాకారులు వెంటనే ఆయనను జయపురం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మరణించినట్లు ప్రకటించారు. ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. కోరాపుఠ్ జిల్లాకు చెందిన మురళి ‘ఖోకా భాయ్’గా అందరికీ సుపరిచితం. మురళీ ప్రసాద్ గత కొంతకాలంగా హృద్రోగ సమస్యలతోపాటు మధుమేహంతో బాధపడుతున్నట్టు ఆయన సోదరుడు బిభూతి ప్రసాద్ మహాపాత్రా తెలిపారు.
గర్భా నృత్యం చేస్తూ కుప్పకూలాడు..
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా విరార్ పట్టణంలో జరిగిన మరో ఘటనలో మనీశ్ నర్జాపీ (35) గర్భా నృత్యం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడాయనను పరీక్షించిన వైద్యులు చనిపోయినట్టు నిర్ధారించారు. కుమారుడి మరణవార్త విన్న మనీశ్ తండ్రి సోనిగ్రా ఆసుపత్రిలో కుప్పకూలి మరణించారు. అయితే, వీరి మరణానికి కారణం ఏమిటన్నది తెలియరాలేదు. పోస్టుమార్టం అనంతరం వారి మృతికి కారణం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.