Liquor Deaths: సారా మరణాలన్నీ జగన్ సర్కారు హత్యలే – ‘నారా లోకేశ్’
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో సారా మరణాలన్నీ జగన్ రెడ్డి సర్కారు చేసిన హత్యలేనని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర ఆరోపణలు చేశారు.
- By Hashtag U Published Date - 11:22 PM, Fri - 11 March 22

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో సారా మరణాలన్నీ జగన్ రెడ్డి సర్కారు చేసిన హత్యలేనని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. రెండు రోజుల్లో 15 మంది మృత్యువాత పడితే, కనీసం ప్రభుత్వంలో సంబంధిత మంత్రికానీ, అధికారి కానీ స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోందని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. జగన్ రెడ్డి తన సొంత బ్రాండ్లు ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్రా గోల్డ్, సెలెబ్రిటీ వంటి చౌక మద్యాన్ని అధికధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారని, పేదలు ఈ మద్యం కొనలేక సారా తాగి మృత్యువాత పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
జంగారెడ్డిగూడెంలో రెండు రోజుల వ్యవధిలో సారా తాగిన వ్యక్తులు 15 మంది మృతి చెందటానికి, ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని దుయ్యబట్టారు. ఒక బాటిల్ తెలంగాణ మద్యం తెస్తే వెంటాడి వేధించి చంపేస్తున్న ఎక్సైజ్ శాఖ ఏం చేస్తోందని, ఏరులై పారుతున్న సారా ఎస్ఈబీకి కనపడటంలేదా అని ప్రశ్నించారు. ఎక్సైజ్ శాఖ మంత్రికి జగన్ భజనలోనే పదవీకాలమంతా పూర్తయ్యిందని, కనీసం ఏం జరిగిందో తెలుసుకునేందుకు కూడా ప్రయత్నించకపోవడం విచారకరమన్నారు. ఈ మరణాలపై న్యాయవిచారణ చేయాలని, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ 25 లక్షల పరిహారం ఇవ్వాలని, సారా కట్టడికి చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ దుకాణాల్లో అమ్ముతున్న మద్యం నాణ్యతపైనా పరీక్షలు జరపాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక సారా తాగి మృతి చెందేవారి సంఖ్య పెరుగుతున్నా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శూన్యమని ఆరోపించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.