Govt Sanitary Napkins: మహిళలకు రూపాయికే 10 శానిటరీ నాప్‌కిన్‌లు అందించనున్న మహారాష్ట్ర ప్రభుత్వం
మహారాష్ట్ర ప్రభుత్వం 60 లక్షల మంది గ్రామీణ మహిళలకు నెలకు 1 రూపాయికి 10 శానిటరీ నాప్‌కిన్‌లను అందించనుంది.
- Author : Hashtag U
Date : 29-05-2022 - 11:21 IST
Published By : Hashtagu Telugu Desk
మహారాష్ట్ర ప్రభుత్వం 60 లక్షల మంది గ్రామీణ మహిళలకు నెలకు 1 రూపాయికి 10 శానిటరీ నాప్‌కిన్‌లను అందించనుంది.
ప్రపంచ రుతుక్రమ పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా… మహారాష్ట్ర ప్రభుత్వం శనివారం ఒక పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద దారిద్య్రరేఖకు దిగువన ఉన్న మహిళలు (BPL), మహిళా బచత్ గట్ (స్వయం సహాయక బృందాలు) చెందిన వారు కేవలం 1 రూపాయికే 10 శానిటరీ నాప్‌కిన్‌లను కొనుగోలు చేయవచ్చు.
రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హసన్ ముష్రిఫ్ దీనిపై ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ పథకం 2022 ఆగస్టు 15 నుండి అమలు చేయబడుతుందని ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుండి దాదాపు 60 లక్షల మంది మహిళలకు ప్రయోజనం చేకూరుస్తుంది. అవగాహన లేకపోవడం, ఆర్థిక స్థోమత లేకపోవడం వల్ల రుతుక్రమం సమయంలో పరిశుభ్రతను ఎదుర్కొనే గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు సహాయం చేయడం ఈ పథకం లక్ష్యంమని ఆయన తెలిపారు. ఈ పథకం అమలు వల్ల ప్రభుత్వానికి ఏటా దాదాపు రూ. 200 కోట్లు ఖర్చవుతుందని మంత్రి తెలిపారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళల మరణాలకు బహిష్టు సమయంలో అజాగ్రత, పరిశుభ్రత పాటించకపోవడం ఒక ప్రధాన కారణమని ప్రకటనలో తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నంలో పేద మహిళల కోసం రూ 1 నామమాత్రపు ధరకు శానిటరీ న్యాప్‌కిన్‌లను అందించే కొత్త పథకాన్ని గ్రామీణాభివృద్ధి శాఖ అమలు చేస్తోంది. ప్రస్తుతం మహారాష్ట్రలో ఆరోగ్య శాఖ అమలుచేస్తున్న రుతుక్రమ పరిశుభ్రత పరిరక్షణ పథకం కింద 19 ఏళ్లలోపు బాలికలకు రూ.6కి ఆరు న్యాప్‌కిన్‌లతో కూడిన రెడీమేడ్ కిట్‌లను అందజేస్తున్నారు. అయితే దారిద్య్రరేఖకు దిగువన ఉన్న మహిళలందరికీ ప్రయోజనం కలకగకపోవడంతో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న మహిళలందరికీ శానిటరీ న్యాప్‌కిన్‌లు అందించేందుకు చర్యలు చేపట్టింది. మహారాష్ట్రలో కేవలం 66 శాతం మంది మహిళలు మాత్రమే శానిటరీ నాప్‌కిన్‌లను ఉపయోగిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఈ నిష్పత్తి ఎక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 17.30 శాతం మంది మహిళలకు మాత్రమే శానిటరీ న్యాప్‌కిన్‌లు అందుబాటులో ఉన్నాయని నివేదిక సూచిస్తుంది.
గ్రామీణ స్వయం సహాయక సంఘాలలో రాష్ట్ర ప్రజారోగ్య శాఖ అమలుచేస్తున్న రుతుక్రమ పరిశుభ్రత పరిరక్షణ పథకంలో 19 ఏళ్లలోపు బాలికలతో సహా అన్ని వయసుల మహిళలకు నామమాత్రపు రుసుముతో నెలకు 10 శానిటరీ న్యాప్‌కిన్‌లతో కూడిన ఒక ప్యాకెట్ లభిస్తుంది.
ప్రతి గ్రామంలో గ్రామసంఘాల ద్వారా శానిటరీ న్యాప్‌కిన్లు అందజేస్తాం.
ఈ పథకం కింద మహిళలకు శానిటరీ న్యాప్‌కిన్ కిట్‌ల వినియోగానికి సంబంధించి వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన, ప్రచారం కల్పిస్తారు.
ఈ పథకంలో 60 లక్షల మందికి పైగా మహిళా లబ్ధిదారులు ఉన్నందున, శానిటరీ న్యాప్‌కిన్‌ల పారవేయడానికి ప్రతి గ్రామ స్థాయిలో యంత్రాలను ఏర్పాటు చేస్తారు.
ఈ యంత్రాలన్నీ జిల్లా పరిషత్, పంచాయతీ సమితి మరియు గ్రామ పంచాయతీ వంటి స్థానిక సంస్థల నిధులతో పాటు ప్రభుత్వ, సిఎస్‌ఆర్ నిధుల ద్వారా ఈ పథకం నిర్వహిస్తున్నారు.