MLC Kavitha: జగిత్యాల కౌన్సిలర్లతో కవిత భేటీ, అవిశ్వాసంపై వెనక్కి
- Author : Balu J
Date : 13-02-2024 - 9:52 IST
Published By : Hashtagu Telugu Desk
MLC Kavitha: బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో ఆ పార్టీకి చెందిన జగిత్యాల కౌన్సిలర్లు మంగళవారం నాడు హైదరాబాద్ లో భేటీ అయ్యారు. వైస్ చైర్మన్ పై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టిన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ నేతృత్వంలో కౌన్సిలర్లు ఎమ్మెల్సీ కవితతో కీలక మంతనాలు జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. పార్టీ అందరికీ అవకాశాలు ఇచ్చిందని, భవిష్యత్తులోనూ సమానావకాశాలు కల్పిస్తుందని తెలిపారు. రానున్న కాలంలో పార్టీ మరింత బలోపేతమై ప్రజల ఆశీర్వాదాన్ని సంపాదిస్తుందన్న విశ్వాసం ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ అంటేనే క్రమశిక్షణకు మారుపేరని స్పష్టం చేశారు.
అధికార పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలపై గట్టిగా పోరాటం చేయవలసిన ఈ తరుణంలో అందరూ కలిసికట్టుగా ప్రయాణం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కాబట్టి అవిశ్వాస తీర్మానంపై పునరాలోచన చేయాలని సూచించారు. దాంతో ఎమ్మెల్సీ కవిత సూచనల మేరకు అవిశ్వాస తీర్మానంపై వెనక్కి తగ్గాలని కౌన్సిలర్లు అక్కడికక్కడే నిర్ణయం తీసుకున్నారు. బుధవారం నాడు అవిశ్వాస తీర్మానంపై జరగబోయే ఓటింగ్ లో పాల్గొనబోమని కౌన్సిలర్లు ప్రకటించారు.