PK Tour: పశ్చిమగోదావరి జిల్లాలో ‘పవన్’ పర్యటన
ఈ నెల 20వ తేదీన నరసాపురంలో ‘మత్సకార అభ్యున్నతి సభ’ నిర్వహించాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు.
- Author : Hashtag U
Date : 04-02-2022 - 10:02 IST
Published By : Hashtagu Telugu Desk
ఈ నెల 20వ తేదీన నరసాపురంలో ‘మత్సకార అభ్యున్నతి సభ’ నిర్వహించాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంపొందింప చేయడం, వృత్తిపరమైన ఉపాధి భరోసా, మత్స్యకారుల డిమాండ్లు ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా మిగిలిపోయాయి. ప్రభుత్వంలోని పెద్దలకు వీటిపై దృష్టిపెట్టే సమయం, ఆలోచన రెండూ లేని నేపథ్యంలో మత్స్యకారుల పక్షాన ముఖ్యంగా మత్స్యకారుల ఉపాధిని దెబ్బ తీసే విధంగా ఉన్న 217 జి.ఓ.పై గళమెత్తడానికి వన్ కళ్యాణ్ ఈ సభ జరపాలని సంకల్పించారు. జనసేన పార్టీ మత్స్యకార వికాస విభాగం ఛైర్మన్ బొమ్మిడి నాయకర్ పర్యవేక్షణలో సభ సాగుతుంది.
ఇందులో భాగంగా ఈ నెల 13వ తేదీ నుంచి ఉభయగోదావరి జిల్లాలకు చెందిన జనసేన నాయకులు, శ్రేణులు, వీర మహిళలు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలోని మత్స్యకార గ్రామాలలో ‘మత్స్యకార అభ్యున్నతి యాత్ర’ చేపడతారు.
13వ తేదీన తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ రూరల్ మండలంలోని సూర్యారావుపేట నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. ఈ యాత్రను జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు ప్రారంభిస్తారు. 13, 14 తేదీల్లో రెండు రోజులపాటు ఈ యాత్రలో ఆయన పాల్గొంటారు. 20న నరసాపురంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బహిరంగ సభ నిర్వహిస్తారు. యాత్రలో పార్టీ మత్స్యకార వికాస విభాగం క్షేత్ర స్థాయిలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలను అధ్యయనం చేస్తుంది. ఇందుకు సంబంధించిన నివేదికను వికాస విభాగం ఛైర్మన్ నాయకర్, ఇతర సభ్యులు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి అందచేస్తారు.