Titanic 2.0: అలస్కా సమీపంలో “టైటానిక్ 2.0” .. మంచుకొండను ఢీకొన్న షిప్
"టైటానిక్ 2.0" ఘటన... అమెరికాలోని అలస్కా ద్వీపం సమీపంలో చోటుచేసుకుంది. టూరిస్టులతో బయలుదేరిన నార్వేకు చెందిన ఒక క్రూయిజ్ షిప్ అలస్కాలోని హబ్బార్డ్ గ్లేషియర్ వద్దకు వెళ్తోంది.
- By Hashtag U Published Date - 06:15 AM, Fri - 1 July 22

“టైటానిక్ 2.0” ఘటన… అమెరికాలోని అలస్కా ద్వీపం సమీపంలో చోటుచేసుకుంది. టూరిస్టులతో బయలుదేరిన నార్వేకు చెందిన ఒక క్రూయిజ్ షిప్ అలస్కాలోని హబ్బార్డ్ గ్లేషియర్ వద్దకు వెళ్తోంది. ప్రయాణం సాఫీగా జరుగుతోంది. ఈక్రమంలో ఒక అలికిడితో అందరూ అవాక్కయ్యారు. క్రూయిజ్ షిప్ కుడి వైపు చివరి కొన భాగం ఒక మంచు కొండ (ఐస్ బర్గ్) ను ఢీకొట్టింది. ఆ వెంటనే డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి షిప్ ను మరో వైపుకు తిప్పడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో టూరిస్టులు ఊపిరి పీల్చుకున్నారు. షిప్ ఢీకొన్న తర్వాత మంచు కొండ కరిగిపోతున్న దృశ్యాలను చూసి వారంతా “ఓ మై గాడ్” దైవాన్ని తల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు ట్విట్టర్ లో వైరల్ అవుతోంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ మంచుకొండ ధాటికి షిప్ లోని కింది అంతస్తు బాగా దెబ్బతింది. అందులోని అద్దాల కిటికీలు, అలంకరణ సామగ్రి, ఫర్నీచర్ ధ్వంసం అయ్యాయి. ఈనేపథ్యంలో ఆ నౌక టూర్ షెడ్యూల్ ను అకస్మాత్తుగా రద్దు చేసి వెనక్కి రమ్మని ఆదేశాలు ఇచ్చారు. దాన్ని వెంటనే అమెరికాలోని పోర్ట్ ఆఫ్ జేన్ కు పిలిపించి సాంకేతిక, భౌతిక తనిఖీలు చేశారు. షిప్ బాగానే ఉందనే నిర్ధారణ కు వచ్చిన అధికారులు దాన్ని తక్కువ వేగంతో నడుపుతూ.. మరమ్మతుల కోసం సియాటెల్ కు తీసుకెళ్లాలని షిప్ నిర్వాహకులకు నిర్దేశించారు. షిప్ లో ఉన్న ప్రయాణికులు అందరూ సియాటెల్ లోనే దిగిపోనున్నారు.
1912 టైటానిక్ ఘటన..
అతిపెద్ద విషాదంగా మిగిలిపోయిన టైటానిక్ ఓడ సముద్రంలో మునిగిపోయి 110 ఏళ్లు పూర్తయ్యాయి. రాయల్ మెయిల్ షిప్ “టైటానిక్” బ్రిటన్‌లోని సౌతాంప్టన్ నుంచి బయలుదేరి ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో మునిగిపోయింది. 1912 ఏప్రిల్ 14న రాత్రివేళ మంచుకొండను ఢీకొట్టింది. దీంతో ఏప్రిల్ 15న ఓడ పూర్తిగా మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 1,500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. టైటానిక్ నిర్మాణం 1909, మార్చి 31న ప్రారంభమైంది. టైటానిక్ నిర్మాణానికి మొత్తం 7.5 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. ఇప్పటి విలువలో ఇది 192 మిలియన్ డాలర్లకు సమానం. వరదలను నిరోధించడానికి 16 వాటర్ టైట్ కంపార్ట్‌మెంట్లను వాడారు. దాదాపు 3,000 మంది వర్కర్లు రె౦డు స౦వత్సరాలు నిరంతరాయంగా పనిచేసిన తర్వాత టైటానిక్ ఒక రూపానికి వచ్చింది. 1911, మే 31న ఓడ బేస్ బాడీ నిర్మాణం పూర్తి చేసుకొని లాంఛ్ అయ్యింది.
https://twitter.com/wowinteresting8/status/1542040661180006404