PSLV-C52: నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సి52..!
- By HashtagU Desk Published Date - 10:46 AM, Mon - 14 February 22

ఇస్రో ఈ ఏడాది చేపట్టిన తొలి ప్రయోగం సక్సెస్ అయ్యింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోట కేంద్రంగా పనిచేస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గగనతలంలో మరోసారి తన సత్తా చాటింది. ఈ క్రమంలో షార్ నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సీ52 (పీఎస్‌ఎల్‌వీ సీ52) సోమవారం ఉదయం 5.59కి నింగిలోకి దూసుకెళ్లింది. 25.30 గంటల కౌంట్‌డౌన్ అనంతరం పీఎస్ఎల్‌వీ ఉపగ్రహం కక్షలోకి దూసుకెళ్ళింది. తనతో పాటు అబ్జర్వేషన్ శాటిలైట్ కూడా తీసుకెళ్లింది సీ-52. అలాగే మరో రెండు పేలోడ్స్ కూడా సన్ సింక్రొనస్ పోలార్ ఆర్బిట్‌లోకి సీ-52 ప్రవేశపెట్టింది.
ఈ నేపధ్యంలో పీఎస్‌ఎల్‌వీ సీ52 ప్రయోగం విజయవంతమైందని ఇస్రో ఛైర్మన్ ప్రకటించారు. దీంతో 2022లో ఇస్రో చేపట్టిన ప్రయోగం విజయవంతం కావడంతో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో శాస్త్రవేత్తలు సంబరాల చేసుకున్నారు. ఇక ఈ పీఎస్‌ఎల్‌వీ సీ52 వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. పీఎస్‌ఎల్‌వీ సీ52 పదేళ్ల పాటు కక్షలో ఉంటుంది. ఎలాంటి వాతావరణ పరిస్థితులలో అయినా 24 గంటలూ పనిచేసేలా ఇస్రో శాస్త్రవేత్తలు దీనిని రూపొందించడం విశేషం. పర్యావరణం, వ్యవసాయం, అటవీ, భూసారం, హైడ్రాలజీ, ఫ్లడ్ మ్యాపింగ్, నీటి వనరుల నిర్వహణకు సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక పీఎస్ఎల్‌వీ సీ 52 విజయవతం కావడంతో ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు ప్రముఖులు భారత శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేస్తున్నారు.