Indrani Mukherjea: ఆ ఒక్క కారణానికే ఇంద్రాణికి బెయిల్
కన్న కూతురిని గొంతు నులిమి చంపేసిందన్న ఆరోపణలపై జైలు శిక్ష అనుభవిస్తోంది ఇంద్రాణి ముఖర్జీ.
- By Hashtag U Published Date - 05:00 AM, Fri - 20 May 22

కన్న కూతురిని గొంతు నులిమి చంపేసిందన్న ఆరోపణలపై జైలు శిక్ష అనుభవిస్తోంది ఇంద్రాణి ముఖర్జీ. ఇంద్రాణి కూతురు షీనా బోరా హత్యకేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఆరున్నరేళ్లుగా జైల్లోనే మగ్గుతోంది ఇంద్రాణి. అయినప్పటికీ ఈ కేసు ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. దోషి ఎవరో తేలాలంటే పక్కా ఆధారాలు కావాలి. ఇందుకోసం సాక్షులను కూడా విచారించాలి. కాని, షీనా బోరా కేసులో మొత్తం సాక్షుల సంఖ్య 237. ఇప్పటి వరకు ప్రాసిక్యూషన్ విచారించింది కేవలం 68 మందిని మాత్రమే. ఈ లెక్కన సాక్షుల విచారణ మొత్తం పూర్తవ్వాలంటే.. యావజ్జీవ శిక్ష కూడా పూర్తవ్వొచ్చు. ఇప్పటికే ఆరున్నరేళ్లు జైల్లో ఉన్నందున.. ఇప్పుడప్పుడే సాక్షుల విచారణ తేలేలా లేనందున ఇంద్రాణి ముఖర్జీకి బెయిల్ ఇస్తున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. నిజానికి ఈ ఒక్క కారణంతోనే షీనా బోరా కేసులో ఇంద్రాణికి బెయిల్ దొరికింది.
ఇంద్రాణి ముఖర్జీ భర్తకు పుట్టిన అమ్మాయే షీనా బోరా. మొదటి భర్తతో విడిపోయాక ప్రముఖ మీడియా ఎగ్జిక్యూటివ్ పీటర్ ముఖర్జీని పెళ్లి చేసుకుంది. షీనా తన కుమార్తె అని కాకుండా తన చెల్లి అనే అందరికీ పరిచయం చేసింది. అయితే, షీనా బోరాకు, పీటర్ ముఖర్జీ మొదటి భార్య కొడుకు రాహుల్ ముఖర్జీతో ఎఫైర్ ఉందని అనుమానించి.. అందరూ కలిసి కట్టుగా షీనా బోరాను చంపేశారని విచారణలో తేలింది.
షీనా బోరాను 2012లో చంపితే.. 2015లో విషయం బయటికొచ్చింది. ఈ మూడేళ్లు షీనా బోరా విదేశాల్లో బంధువుల దగ్గర ఉందని నమ్మిస్తూ వచ్చింది. అయితే, ఏదో కేసులో ఇంద్రాణి డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తుంటే.. షీనా బోరాను తల్లి ఇంద్రాణియే చంపిందన్న విషయం బయటకు పొక్కింది. ఈ మర్డర్‌కు భర్త పీటర్ ముఖర్జీ, డ్రైవర్ శ్యామ్‌వర్ రాయ్ సహకరించినట్టుగా తేల్చారు. అయితే, తన కూతురు షీనా బోరా బతికే ఉందంటూ ఆ మధ్యన ట్విస్ట్ ఇచ్చింది ఇంద్రాణి. మొత్తానికి అసలు ఈ కేసులో ఏం జరిగింది, ప్రధాన దోషులు ఎవరు అనేది పూర్తిగా తేలాల్సి ఉంది.