Mohali Test: మూడురోజుల్లోనే ముగించారు
సొంతగడ్డపై టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. అన్ని విభాగాల్లోనూ పూర్తి ఆధిపత్యం కనబరిచిన భారత్ తొలి టెస్టులో శ్రీలంకను చిత్తు చేసింది.
- By Naresh Kumar Published Date - 05:25 PM, Sun - 6 March 22

సొంతగడ్డపై టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. అన్ని విభాగాల్లోనూ పూర్తి ఆధిపత్యం కనబరిచిన భారత్ తొలి టెస్టులో శ్రీలంకను చిత్తు చేసింది. ఆల్‌రౌండర్ జడేజా బ్యాట్‌తో పాటు బంతితోనూ అదరగొట్టిన వేళ లంక చేతులెత్తేసింది. అందరూ ఊహించినట్టుగానే భారత్ తొలిరోజు నుంచే పూర్తి ఆధిపత్యం కనబరిచింది.
ఓపెనర్లు భారీ ఆరంభాన్ని ఇవ్వలేకపోయినా విహారీ, కోహ్లీ పార్టనర్‌షిప్‌తో కోలుకుంది. తర్వాత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఇన్నింగ్స్ హైలెట్‌గా నిలిచింది. లంక బౌలర్లను ఆటాడుకున్న జడేజా శతకంతో చెలరేగిపోయాడు. భారీ షాట్లతో అదరగొట్టిన జడ్డూ 175 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. లోయర్ ఆర్డర్‌లో అశ్విన్ కూడా రాణించడంతో భారత్ 574 పరుగులకు డిక్లేర్ చేసింది. తర్వాత బ్యాటింగ్‌లోనూ లంక నిరాశపరిచింది. ఆ జట్టు బ్యాటర్లు కనీస పోరాటం కూడా లేకుండానే చేతులెత్తేశారు. నిస్సంక తప్పిస్తే మిగిలిన వారంతా స్పిన్నర్ మ్యాజిక్‌తో పెవిలియన్‌కు క్యూ కట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో లంక 174 పరుగులకే కుప్పకూలగా.. తర్వాత ఫాలోఆన్‌లోనూ సేమ్ సీన్ రిపీటైంది.
జడేజా ఒకవైపు.. అశ్విన్ మరోవైపు బంతిని తిప్పేయడంతో లంక కోలుకోలేకపోయింది. క్రీజులో నిలవాలన్న పట్టుదల కూడా కనబరచలేకపోయిన లంక రెండో ఇన్నింగ్స్‌లో 178 పరుగులకే కుప్పకూలింది.వికెట్ కీపర్ డిక్‌విల్లా హాఫ్ సెంచరీ తప్పిస్తే.. మిగిలిన వారంతా విఫలమయ్యారు. సహజంగానే స్పిన్నర్లకు అనుకూలించే మొహాలీ పిచ్‌పై జడేజా చెలరేగిపోయాడు. మ్యాచ్‌లో మొత్తం 9 వికెట్లు తీసిన జడేజా లంక పతనాన్ని శాసించాడు. అటు అశ్విన్ ఏడు వికెట్లు పడగొట్టాడు. దీంతో ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న భారత్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.
గాయం నుంచి కోలుకున్న తర్వాత జట్టులోకి వచ్చిన జడేజా ఆల్‌రౌండర్ ప్రదర్శనతో రీఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు. సిరీస్‌లో రెండో టెస్ట్ మార్చి 12 నుంచి బెంగళూరు వేదికగా డే నైట్ మ్యాచ్‌గా జరుగుతుంది.
Pic Courtesy- BCCI/Twitter
𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗪𝗜𝗡! 👏 👏@ImRo45 begins his Test captaincy stint with a win as #TeamIndia beat Sri Lanka by an innings & 2⃣2⃣2⃣ runs in the first @Paytm #INDvSL Test in Mohali. 👌 👌
Scorecard ▶️ https://t.co/XaUgOQVg3O pic.twitter.com/P8HkQSgym3
— BCCI (@BCCI) March 6, 2022