Alcohol: తెలంగాణలో అత్యధికంగా మద్యం తాగింది ఆ జిల్లాలోనే.. రూ.376 కోట్లు..
చుక్క ముక్క తో చేసుకునే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో వచ్చే కిక్కే వేరు. తెలంగాణ వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం ఏరులై పారితే..
- By News Desk Published Date - 07:16 PM, Tue - 2 January 24

Alcohol: సాధారణంగానే వీకెండ్ లో ముక్క లేకపోతే ముద్ద దిగదు. మరీ అదే డిసెంబర్ 31 అయితే నాన్ వెజ్ తినకుండా ఉంటారా?.. చుక్క ముక్క తో చేసుకునే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో వచ్చే కిక్కే వేరు. తెలంగాణ వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం ఏరులై పారితే.. ఒక్క మెదక్ జిల్లాలోనే మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. 2022 డిసెంబర్ లో ఉమ్మడి మెదక్ జిల్లాలో రూ.300 కోట్ల విలువైన మద్యం అమ్మగా.. 2023 డిసెంబర్ లో రూ.376 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి.
సంగారెడ్డి జిల్లాలో రూ.180 కోట్లు, సిద్ధిపేట జిల్లాలో రూ.131 కోట్లు, మెదక్ జిల్లాలో రూ.64 కోట్ల మద్యం అమ్ముడుపోయింది. డిసెంబర్ 30,31 తేదీల్లో 37 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. చివరి రెండు రోజుల్లో 2022 కంటే.. 2023లో రూ.9 కోట్ల మద్యం అధికంగా అమ్ముడుపోయింది. సాధారణ రోజులతో పోల్చితే.. 30,31 తేదీల్లో మద్యం అమ్మకాలు రెండింతల కంటే ఎక్కువే.
జిల్లా వ్యాప్తంగా 243 మద్యం దుకాణాలు, 70కి పైగా బార్లు ఉండగా.. సాధారణ రోజుల్లో రూ.6-8 కోట్ల అమ్మకాలు జరుగుతాయి. కొత్తసంవత్సరం, పైగా వీకెండ్ కావడంతో సంగారెడ్డి జిల్లాలో 18,197 కేసుల మద్యం, సిద్ధిపేట జిల్లాలో 11,310 కేసుల మద్యం, మెదక్ జిల్లాలో 7266 కేసుల మద్యం విక్రయాలు జరిగాయి. ఇక డిసెంబర్ 31న ఉమ్మడి మెదక్ జిల్లాలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 610 కేసులు నమోదయ్యాయి. రాంగ్ రూట్ కేసులు 250, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 150, ఓవర్ స్పీడ్ కేసులు 120, హెల్మెట్ లేని వాహనదారులపై 57 కేసులు నమోదయ్యాయి.