Showrya Chakra : అమర జవాన్ కు అత్యున్నత పురస్కారం
ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో వీరమరణం పొందిన అమర జవాన్ మారుప్రోలు జస్వంత్ రెడ్డికి అత్యున్నత శాంతియుత శౌర్యచక్ర పురస్కారం లభించింది
- By Hashtag U Published Date - 10:55 AM, Thu - 27 January 22
ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో వీరమరణం పొందిన అమర జవాన్ మారుప్రోలు జస్వంత్ రెడ్డికి అత్యున్నత శాంతియుత శౌర్యచక్ర పురస్కారం లభించింది. జస్వంత్ రెడ్డి స్వస్తలం బాపట్ల మండలం దరివాడ కొత్తపాలెం గ్రామం. శౌర్యచక్రకు ఆరుగురు ఆర్మీ సిబ్బందిని ఎంపిక చేయగా, వారిలో జస్వంత్‌రెడ్డితో సహా ఐదుగురికి మరణానంతరం అవార్డు లభించింది. జూలై 8న జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలోని సుందర్‌బని సెక్టార్‌లోని దద్దల్ గ్రామంలో చొరబాటు ప్రయత్నాన్ని భగ్నం చేసేందుకు భద్రతా దళాలు ఆపరేషన్ జరిపాయి. నియంత్రణ రేఖ వద్ద జరిగిన కాల్పుల్లో మద్రాస్ రెజిమెంట్‌కు చెందిన 17వ బెటాలియన్‌కు చెందిన జస్వంత్, మరో సైనికుడు మరణించారు.
ఆ రోజు ఉదయం 6:50 గంటలకు, జస్వంత్ స్కౌట్ నంబర్ 2 గా దట్టమైన అటవీ భూభాగంలో వెతుకుతున్నప్పుడు, ఉగ్రవాదుల కదలికను గమనించి వారిని ఎదుర్కొన్నాడు. ఆ ఉగ్రదాడిలో జస్వంత్ రెడ్డి వీరమరణం పొందాడు. జస్వంత్‌కు మరణానంతరం శౌర్య చక్ర అవార్డు లభించింది. జస్వంత్ తన ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత సైన్యంలో చేరాడు. అతని తల్లిదండ్రులు ఎం శ్రీనివాస రెడ్డి, వెంకటేశ్వరమ్మ వ్యవసాయదారులు. అతనికి ఇద్దరు తమ్ముళ్లు. జస్వంత్ మృతి దిగ్భ్రాంతి నుంచి ఇంకా కోలుకోని ఆయన కుటుంబసభ్యులు ఆయన త్యాగానికి కృతజ్ఞతలు తెలిపారు. జస్వంత్‌కు శౌర్యచక్రతో సత్కరించడం సంతోషంగా ఉందని ఆయన తల్లిదండ్రులు తెలిపారు. జస్వంత్‌కు చిన్నప్పటి నుంచి సైనికుడిగా దేశానికి సేవ చేయాలని కలలు కనేవాడని.. తన అభిరుచిని అర్థం చేసుకుని సైన్యంలోకి పంపిచామని తెలిపారు. జస్వంత్ తన స్వస్థలానికి వెళ్ళిన సమయంలో గ్రామ యువకులను సైన్యంలో చేరమని ప్రోత్సహించేవాడని.. వారికి శారీరక దృఢత్వంలో శిక్షణ కూడా ఇచ్చాడని తెలిపారు. ఇప్పుడు తమ్ముడు విశ్వంత్ రెడ్డి సైన్యంలో చేరాలనే పట్టుదలతో ఉన్నాడని జస్వంత్ తండ్రి తెలిపారు.