Google Pays 82000 Crores : గూగుల్ ఆ కంపెనీలకు ఏటా 82వేల కోట్లు ఇస్తోంది.. అమెరికా సర్కారు సంచలన ఆరోపణలు
Google Pays 82000 Crores : ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ పై అమెరికా ప్రభుత్వం సంచలన ఆరోపణలు చేసింది.
- Author : Pasha
Date : 13-09-2023 - 8:57 IST
Published By : Hashtagu Telugu Desk
Google Pays 82000 Crores : ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ పై అమెరికా ప్రభుత్వం సంచలన ఆరోపణలు చేసింది. ఆన్‌లైన్ సెర్చ్‌పై తన గుత్తాధిపత్యాన్ని కాపాడుకోవడానికి యాపిల్, ఇతర స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలకు గూగుల్ ప్రతి సంవత్సరం దాదాపు రూ.82వేల కోట్ల దాకా చెల్లింపులు చేస్తోందని పేర్కొంది. అమెరికా యాంటీ ట్రస్ట్ కు సంబంధించిన కేసులో మంగళవారం వాషింగ్టన్ కోర్టులో జరిగిన తొలి రోజు విచారణ సందర్భంగా అమెరికా న్యాయశాఖ తరఫు న్యాయవాది కెన్నెత్ డింట్జెర్ ఈ ఆరోపణ చేశారు. ఫోన్‌లు, వెబ్ బ్రౌజర్‌లలో గూగుల్ సెర్చ్ ఇంజన్ ను డీఫాల్ట్ గా ఉంచడానికి గూగుల్ ప్రతి సంవత్సరం యాపిల్, ఇతర స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలకు రూ.82వేల కోట్ల దాకా పేమెంట్స్ చేస్తోందన్నారు. తద్వారా సెర్చ్ ఇంజన్ మార్కెట్లో ఇతరులు ఎదిగే అవకాశం లేకుండా అవాంతరం క్రియేట్ చేస్తోందన్నారు. ‘‘ఈ కేసు ఇంటర్నెట్ భవిష్యత్తుకు సంబంధించింది. సెర్చ్ ఇంజన్ లో Google ఎప్పుడైనా అర్ధవంతమైన పోటీని ఎదుర్కొంటుందా?’’ అని కెన్నెత్ డింట్జెర్ ప్రశ్నించారు. జడ్జి అమిత్ పి.మెహతా ఎదుట ఈ వాదనలు జరిగాయి.
Also read : Famous Ganesh Temples : దేశంలోని ఆరు ప్రముఖ వినాయక ఆలయాలివే..
గూగుల్ తరఫు న్యాయవాది ఏమన్నారంటే..
గూగుల్ తరఫు న్యాయవాది జాన్ ష్మిడ్‌లిన్ ప్రతివాదనలు వినిపిస్తూ.. తమపై చేసిన ఆరోపణలను ఖండించారు. ‘‘గత కొన్ని దశాబ్దాలుగా గూగుల్ తన సెర్చ్ ఇంజన్‌ను డెవలప్ చేస్తూ వస్తోంది. తమపై ఆరోపణలు చేస్తున్న వారు ఈవిషయాన్ని మర్చిపోతున్నారు’’ అని జాన్ ష్మిడ్‌లిన్ కోర్టుకు తెలిపారు. భారీగా పెట్టుబడులు పెట్టడం, సెర్చ్ ఇంజన్ సేవల్లో నాణ్యతను పెంచడం వల్లే తమపై నెటిజన్లకు విశ్వసనీయత పెరిగిందని స్పష్టంచేశారు. ఐఫోన్ సహా అన్ని స్మార్ట్ ఫోన్లలోని బ్రౌజర్లలో గూగుల్ కు స్థానం దక్కడానికి కారణం.. దానికి ప్రజల్లో ఉన్న క్రేజ్, విశ్వసనీయత మాత్రమేనని గూగుల్ తరఫు న్యాయవాది తేల్చి చెప్పారు. కాగా, ఈ యాంటీ ట్రస్టు కేసులో ఇంటర్నెట్ ఏకఛత్రాధిపత్యం విషయంలో గూగుల్ పై ఆరోపణలు చేసిన బాధిత సెర్చ్ ఇంజన్ కంపెనీల జాబితాలో మైక్రోసాఫ్ట్ యొక్క బింగ్, డక్‌డక్‌గో వంటివి (Google Pays 82000 Crores) ఉన్నాయి.