Supreme Court:ఈ రోజు సుప్రీంకోర్టులో నాలుగు కీలక కేసులు.. పెగాసస్, రేపిస్టుల విడుదల..
ఇవ్వాళ్ళ సుప్రీం కోర్టు ముందుకు నాలుగు కీలక కేసులు రానున్నాయి. దేశంలో సంచలనం సృష్టించిన పెగాసస్, గుజరాత్ రేపిస్టుల విడుదల, ఈడీ కి సంబంధించి పీఎల్‌ఎంఏపై ఇచ్చిన తీర్పు పై సమీక్ష, పంజాబ్ లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా భద్రతా లోపాలపై పిటిషన్లను కోర్టు ఈ రోజు విచారించనుంది.
- By Hashtag U Published Date - 01:49 PM, Thu - 25 August 22

ఇవ్వాళ్ళ సుప్రీం కోర్టు ముందుకు నాలుగు కీలక కేసులు రానున్నాయి. దేశంలో సంచలనం సృష్టించిన పెగాసస్, గుజరాత్ రేపిస్టుల విడుదల, ఈడీ కి సంబంధించి పీఎల్‌ఎంఏపై ఇచ్చిన తీర్పు పై సమీక్ష, పంజాబ్ లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా భద్రతా లోపాలపై పిటిషన్లను కోర్టు ఈ రోజు విచారించనుంది.
పెగసస్ స్పైవేర్ వ్యవహారంపై సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని స్పెషల్ బెంచ్ విచారించనున్నది. దేశంలోని ప్రముఖ మేదావులు, రచయితలు, జర్నలిస్టులు, రాజకీయ నాయకుల పై గూఢచర్యం చేసేందుకు ఇజ్రాయెల్ మాల్వేర్ పెగాసస్ ను కేంద్రం ఉపయోగించిందని ఆరోపణలొచ్చాయి. దీనిపై గతంలో సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ రవీంద్రన్ నేతృత్వంలో అక్టోబర్‌లో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూలైలో రవీంద్రన్ నేతృత్వంలోని కమిటీ నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించింది.
అలాగే గుజరాత్ మత దాడుల సందర్భంగా బిల్కిస్ బానో అనే మహిళపై సామూహిక అత్యాచారం చేసి, ఏడుగురిని హత్య చేసిన కేసులో శిక్ష అనుభవిస్తున్న 11 మంది రేపిస్టులను ప్రభుత్వం విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై కూడా ఈ రోజు విచారణ జరగనుంది. ఈ రెండు కేసులతో పాటు ఈడీ అధికారాల గురించి పీఎల్‌ఎంఏపై ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం దాఖలు చేసిన పిటిషన్, ప్రధాని నరేంద్ర మోదీ జనవరిలో పంజాబ్ పర్యటన సందర్భంగా భద్రతా లోపాలపై దాఖలైన పిటిషన్‌పై సైతం సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరుపనున్నది.