Government Employees Retirement Age: ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసుపై కేంద్రం క్లారిటీ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు (Retirement age)ని మార్చే ప్రతిపాదన ఏదీ ప్రస్తుతం పరిశీలనలో లేదని సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభలో వెల్లడించారు.
- By Kode Mohan Sai Published Date - 04:58 PM, Wed - 4 December 24

Government Employees Retirement Age: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసులో మార్పు చేయడం గురించి ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును పెంచేందుకు ఎటువంటి ప్రతిపాదన కూడా తన పరిశీలనలో లేదని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. లోక్‌సభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 60 సంవత్సరాలు పూర్తయ్యాక పదవీ విరమణ అవుతున్నారు.
మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, ఖాళీగా ఉన్న పోస్టులను సమయానుకూలంగా భర్తీ చేయాలని అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయంప్రతిపత్తి సంస్థలు, మరియు ఇతర విభాగాలకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో, రోజ్‌గార్ మేళాల ద్వారా అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు, విద్యా, ఆరోగ్య రంగాల్లో ఖాళీలను మిషన్ మోడ్ లో భర్తీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.