Gaddar Died : గద్దర్ మృతిపట్ల సినీ , రాజకీయ ప్రముఖుల సంతాపం
గత కొద్దీ రోజులుగా అనారోగ్యం తో బాధపడుతున్న గద్దర్
- By Sudheer Published Date - 07:27 PM, Sun - 6 August 23

ప్రజాగాయకుడు , ప్రజాయుద్ధనౌక , ఉద్యమనేత , విప్లవకారుడు గద్దర్ (gaddar) కన్నుమూయడం యావత్ ప్రజానీకాన్ని శోకసంద్రంలో పడేసింది. గత కొద్దీ రోజులుగా అనారోగ్యం తో బాధపడుతున్న గద్దర్..అపోలో హాస్పటల్ ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఈయన మరణం పట్ల సినీ, రాజకీయ , ప్రజా సంఘాలు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
ప్రజా గాయకుడు గద్దర్ మృతి చెందడం బాధాకరమని తెలంగాణ మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. ఉద్యమ సమయంలో గద్దర్‌తో కలిసి పని చేశామని, తన గళంతో కోట్ల మందిని గద్దర్ ఉత్తేజపరిచారన్నారు. గద్దర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు అసెంబ్లీ వేదికగా తెలిపారు.
గద్దర్ మృతి బడుగు, బలహీన వర్గాలకు తీరని లోటని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి (Pocharam Srinivas Reddy) అన్నారు. గద్దర్ మృతిపట్ల దిగ్భాంతి వ్యక్తం చేస్తూ.. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
గద్దర్ తాను మరణించినా పాట రూపంలో కోట్లామంది జనం గుండెల్లో నిలిచే ఉంటారని వ్యవసాశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. కాలికి గజ్జెకట్టి తెలంగాణ ఉద్యమంలో తన ఆట,పాటలతో తెలంగాణ సమాజాన్ని ఉర్రూతలు ఊగించిన గద్దర్..తన పాటలతో కోట్లాది మంది హృదయాలను ఉత్తేజపరిచారని..అలాంటి ఆయన మరణం తీరని లోటన్నారు మంత్రి హరీష్ రావు (Harish Rao).
గద్దర్ గా పేరొందిన విఠల్ కవిగా, గాయకుడిగా ఆట, పాటలతో లక్షలాది మంది అభిమానాన్ని చూరగొన్నారని, ప్రజల్లో చైతన్యం నింపారని మంత్రి గంగుల తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. గద్దర్ అకాల మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటని, ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానులకు తన ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలిపారు.
అలాగే ఏపీ జగన్ (AP CM Jagan) సైతం..గద్దర్ మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. “ప్రజా కవి, గాయకుడు, బడుగు, బలహీనవర్గాల విప్లవ స్ఫూర్తి గద్దర్. గద్దర్ పాట ఎప్పుడూ సామాజిక సంస్కరణల పాటే. ఆయన నిరంతరం సామాజిక న్యాయం కోసమే బతికారు. ఆయన మరణం ఊహించనిది. సామాజిక న్యాయ ప్రవక్తల భావాలు, మాటలు, వారి జీవితాలు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూ జీవించే ఉంటాయి. గద్దర్ గారికి మొత్తంగా తెలుగు జాతి సెల్యూట్ చేస్తోంది. ఆయన కుటుంబ సభ్యులకు ఈ కష్ట సమయంలో మనమంతా బాసటగా ఉందాం” అన్నారు.
భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) సైతం గద్దర్ మృతి పట్ల సంతాపం తెలిపారు. ఉద్యమ గళం మూగబోయిందని, ప్రజా యుద్ధనౌక గద్దర్ గారు కన్నుమూశారన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయనతో నాకు మంచి అనుబంధం ఏర్పడిందని, నా పోరాటానికి ఆయనే స్ఫూర్తి అని ఆయన వెల్లడించారు. జన నాట్యమండలి వ్యవస్థాపకుల్లో గద్దర్ ఒకరు అని, ప్రజా సమస్యలపై ఆయన పోరాటం అజరామరం అని అన్నారు. తనదైన పాటలతో ఎంతోమందిని ఉత్తేజ పరిచారు గద్దర్ అని, తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర కీలకమని ఆయన కొనియాడారు.
మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi) ట్విట్టర్ వేదికగా గద్దర్ మరణం ఫై స్పందించారు. గద్దర్ గళం అజరామరం, ఏ పాట పాడినా దానికో ప్రయోజనం ఉండేలా గొంతెత్తి పోరాడిన ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దరన్నకు లాల్ సలాం అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. అలాగే బాలకృష్ణ , చంద్రబాబు , సోనియాగాంధీ , రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ తదితరులు సంతాపం తెలిపారు. ప్రస్తుతం గద్దర్ పార్థీవదేహాన్ని హాస్పటల్ నుండి ప్రజా సందర్శనార్థం ఎల్బీ స్టేడియానికి తరలించారు.
Read Also : TSRTC Merger Bill : ఆర్టీసీ కార్మికుల విలీనం బిల్లుకు శాసన సభ ఆమోదం