Revanth Sorry To Komatireddy: ఐ యామ్ సారీ వెంకన్న!
టీక్రాంగెస్ స్టార్ క్యాంపెయినర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య గ్యాప్ పెరిగిపోయిన విషయం తెలిసిందే.
- Author : Balu J
Date : 13-08-2022 - 11:01 IST
Published By : Hashtagu Telugu Desk
టీక్రాంగెస్ స్టార్ క్యాంపెయినర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య గ్యాప్ పెరిగిపోయిన విషయం తెలిసిందే. రేవంత్‌రెడ్డి తనకు క్షమాపణ చెప్పిన తర్వాతే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం స్పష్టం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేతలను సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని రేవంత్‌పై ప్రత్యేక ఇంటర్వ్యూలో మండిపడ్డారు. శనివారం మునుగోడులో చేపట్టనున్న కాంగ్రెస్ పాదయాత్రలో పాల్గొనాల్సిందిగా తనను ఎవరూ ఆహ్వానించలేదని వెంకట్ రెడ్డి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి ఇంటికి వెళ్లిన రేవంత్ తన ఇంటికి రాకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. అంతేకాదు.. చండూరులో జరిగిన బహిరంగ సభలో కొందరు కాంగ్రెస్ నేతలు తనపై విమర్శలు చేశారని ఎంపీ ఆరోపించారు. నాకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు బహిరంగ సభలోనే రేవంత్ తనను (దయాకర్) హెచ్చరించి ఉండాల్సిందని ఆయన అన్నారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మెట్టు దిగకపోవడంతో వీటికి ఫుల్ స్టాప్ పెట్టాలని టీకాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ప్రత్యేక వీడియోను షేర్ చేశారు. ‘‘ఈ మధ్య పత్రిక సమావేశంలో హెంగార్డు ప్రస్తావన, మునుగోడు సభలో అద్దంకి దయాకర్ పరుష పదజాలం వాడటంతో కోమటిరెడ్డిగారూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నేను బేషరత్తుగా భువనగిరి ఎంపీ, స్టార్ కంపెయినర్ కు క్షమాపణలు చెబుతున్నా. ఇట్లాంటి భాష ఎవరికీ మంచిది కాదు. తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన కోమటిరెడ్డికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు. ఇక ముందు ఇలాంటివి రిపీట్ కాదు’’ అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పడంతో కోమటిరెడ్డి ఏవిధంగా స్పందిస్తారోనని యావత్తు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక రేవంత్ సారీతోనైనా ఈ ఎపిసోడ్ ముగిస్తుందా? లేదా అనేది వేచి చూడాల్సిందే!
My apologies to brother and colleague @KomatireddyKVR garu. @manickamtagore @UttamINC pic.twitter.com/v7gkvXtlRD
— Revanth Reddy (@revanth_anumula) August 13, 2022