650 KG Ghee : అయోధ్య రామాలయం కోసం జైపూర్ నెయ్యి.. థాయ్‌లాండ్ మట్టి.. కంబోడియా పసుపు
650 KG Ghee : జనవరి 22న అయోధ్యలోని నవ్య భవ్య రామ మందిరంలో శ్రీరాముడి ప్రతిష్ఠాపనా మహోత్సవం అంగరంగ వైభవంగా జరగబోతోంది.
- By Pasha Published Date - 03:49 PM, Fri - 8 December 23

650 KG Ghee : జనవరి 22న అయోధ్యలోని నవ్య భవ్య రామ మందిరంలో శ్రీరాముడి ప్రతిష్ఠాపనా మహోత్సవం అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఈనేపథ్యంలో రామాలయం కోసం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు రకరకాలుగా చేయూత అందిస్తున్నారు. ఆలయంలో రామలాల వ్రతం, నిత్య జ్యోతి ప్రజ్వలన కోసం 650 కిలోల ఆవు నెయ్యిని రాజస్థాన్ జోధ్‌పూర్‌లోని బనాద్‌లో ఉన్న రామ్ ధరమ్ గోశాల విరాళంగా అందజేసింది. ఈ నెయ్యిని 108 కలశాలలో నింపి ఐదు ఎద్దుల బండ్లలో జోధ్‌పూర్ నుంచి అయోధ్యకు పంపారు. నవంబర్ 27న జోధ్‌పూర్ నుంచి బయలుదేరిన ఈ ఎద్దుల బండ్లు గురువారం సాయంత్రం అయోధ్యలోని కరసేవకపురానికి చేరుకుంది. శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌కు రామ్ ధరమ్ గోశాల నిర్వాహకులు మహర్షి సాందీపని ఈ నెయ్యి కలశాలను అందజేశారు.
We’re now on WhatsApp. Click to Join.
రామమందిరం కోసం సేకరించే నెయ్యిని అందించే ఆవులకు పచ్చి మేత, పొడి మేత, నీరు మాత్రమే ఇచ్చారు. ఆవుల కొట్టానికి వచ్చేవారు కూడా ఈ ఆవులకు బయటి నుంచి తెచ్చిన మేతను తినిపించకుండా కంట్రోల్ చేశారు. నెయ్యి స్వచ్ఛతను కాపాడేందుకు ఆవుల ఆహారపు అలవాట్లలో మార్పులు చేశారు.
Also Read: Rs 100 Crore : కాంగ్రెస్ ఎంపీ నివాసాల్లో రూ.100 కోట్లు లభ్యం
జోధ్‌పూర్ నుంచి వచ్చిన ఆవు నెయ్యిని స్వీకరించే కార్యక్రమానికి హాజరైన శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర కోశాధికారి మహంత్ గోవింద్ దేవ్ గిరి మాట్లాడారు. ఇటీవల థాయ్‌లాండ్‌లో జరిగిన ప్రపంచ హిందూ మహాసభలో పాల్గొనేందుకు తాను కంబోడియాకు వెళ్లానని ఆయన తెలిపారు. రామ మందిర పూజా కార్యక్రమాలలో వాడేందుకు అక్కడి ప్రజలు భక్తిశ్రద్దలతో స్వచ్ఛమైన పసుపును బహుమతిగా ఇచ్చారని గోవింద్ దేవ్ గిరి చెప్పారు. థాయ్‌లాండ్ రాజు.. అయోధ్య రామమందిరం కోసం మట్టిని ఇచ్చారన్నారు. అయోధ్యలాగే థాయ్‌లాండ్‌లో కూడా అయోధ్య నగరి ఉందని చెప్పారు. అయితే అక్కడ అయోధ్య నగరిని అయుత అని పిలుస్తారని(650 KG Ghee) ఆయన వివరించారు.