Roop Kund : వామ్మో ఆ సరస్సు చుట్టూ అస్థిపంజరాలే..!
Roop Kund : ఈ సరస్సు చుట్టూ కనబడే మానవ అస్థిపంజరాలు కారణంగా దీనికి "స్కెలిటన్ లేక్" అనే పేరు వచ్చింది. ఈ అస్థిపంజరాలు 800 CE నుంచి 1800 CE మధ్య కాలానికి చెందినవిగా చెపుతుంటారు.
- By Sudheer Published Date - 07:30 PM, Wed - 6 November 24

భారతదేశంలో ఎన్నో మిస్టీరియస్ ప్రదేశాలున్నాయి. అందులో ఒకటి రూప్కుండ్ లేక్ (Skeleton Lake). ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయ శ్రేణుల్లో ఉన్న రూప్కుండ్ లేక్ (Skeleton Lake) అనేది ప్రపంచంలోనే అత్యంత రహస్యంగా ఉన్న ప్రదేశాల్లో ఒకటి. ఇది సముద్ర మట్టానికి 16,740 అడుగుల ఎత్తులో ఉంది. ఈ సరస్సు చుట్టూ కనబడే మానవ అస్థిపంజరాలు కారణంగా దీనికి “స్కెలిటన్ లేక్” అనే పేరు వచ్చింది. ఈ అస్థిపంజరాలు 800 CE నుంచి 1800 CE మధ్య కాలానికి చెందినవిగా చెపుతుంటారు. ప్రజలు అనేక మందికి వ్యాపించే రోగం, భూపాతం లేదా హిమవృష్టి కారణంగా మరణించారని గతంలో నిపుణులు నమ్మారు. 1960లలో సేకరించిన కర్బనం నమూనాల ప్రకారం ప్రజలు 12వ శతాబ్దం నుండి 15వ శతాబ్దం వరకూ ఇక్క జీవించినట్టు అనిశ్చితంగా తెలపబడింది.
కొన్ని పరిశోధకులు ఈ అస్థిపంజరాలు తుఫాను లేదా పెద్ద ఉరుములు, వర్షాల కారణంగా మరణించిన వారివిగా చెపుతుంటారు. కొన్ని శరీరాలపై గాయాలు వాటిని పెద్ద మోస్తరు మంచు కొండలకు తాకి మరణించారు కావొచ్చు అని చెపుతుంటారు. ఇటీవలి డీఎన్ఏ విశ్లేషణలు ఈ అస్థిపంజరాలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినవిగా చెప్పుకొచ్చారు. వీరిలో కొంతమంది భారతీయులతో పాటు మరికొంతమంది మధ్యధరా ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు.
2004లో భారతీయ, యూరోపియన్ శాస్త్రజ్ఞుల బృందం అస్థిపంజరాలను అధ్యయనం చేసేందుకు ఇక్కడ పర్యటించింది. ఈ బృందం ఆభరణాలు, పుర్రెలు, ఎముకలు వంటి ముఖ్యమైన ఆధారాలను కనుగొంది. మృతదేహాల కణజాలాన్ని భద్రపరచింది. మృతదేహాల మీద చేసిన DNA పరీక్షల్లో, ఈ అస్థిపంజరాలు అనేక సమూహాల ప్రజలకు చెందినవని తేలింది. ఇందులో దగ్గర సంబంధం ఉన్న పొట్టి వ్యక్తులు (బహుశా స్థానిక మోతకూలీలు), పొడవాటి వ్యక్తులూ ఉన్నారు. ఈ అస్థిపంజర అవశేషాలు 500ల కన్నా ఎక్కువ మందికి సంబంధించినవై ఉంటాయని భావించారు. ఆక్స్‌ఫోర్డ్ యూనివర్శిటీ ఏక్సిలరేటర్ యూనిట్, రేడియోకార్బన్ డేటింగు పరీక్ష జరిపి, ఈ ఎముకలు సా.శ 850 నాటివిగా నిర్ణయించింది. ఈ కాలానికి 30 సంవత్సరాలు అటూ ఇటూగా ఉండవచ్చు.
పుర్రెలలోని బీటలను అధ్యయనం చేసిన హైదరాబాద్, పూణే, లండన్‌లోని శాస్త్రజ్ఞులు, ఈ వ్యక్తులు వ్యాధి కారణంగా మరణించలేదని, ఆకస్మిక వడగళ్ళతుఫాను వల్ల మరణించారనీ తెలిపారు.[ వడగళ్ళు దాదాపు క్రికెట్ బాల్ అంత పెద్దవిగా ఉంటాయి. వాటి నుండి తలదాచుకునేందుకు హిమాలయాలపై ఏ విధమైన ఆశ్రయమూ లేనందున అందరూ మరణించారు. కాలుష్యంలేని గాలి, అతిశీతల స్థితుల కారణంగా అనేక మృతదేహాలు చెడిపోకుండా చక్కగా సంరక్షించబడి ఉన్నాయి. ఈ ప్రాంతంలో భూపాతాలు జరగడం వలన కొన్ని మృతదేహాలు సరస్సులో పడిపోయాయి. మరణానికి ముందు ఈ వ్యక్తులంతా ఎక్కడకు వెళ్తూ ఉండి ఉంటారో నిర్ధారించలేకపోయారు. ఈ ప్రాంతంలో టిబెట్ వెళ్ళటానికి వర్తక మార్గాలు ఉన్నట్టు ఏ విధమైన చారిత్రిక ఆధారమూ లేదు.
రూప్కుండ్ సరస్సు అనేది పర్యాటకులను, ముఖ్యంగా అడ్వెంచర్ ప్రేమికులను, అనేక కథలతో ఆకర్షిస్తుంది. హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేసే వారు ఈ సరస్సు దగ్గరకు వెళ్ళడానికి ఎక్కువగా ట్రై చేస్తుంటారు.. ఎందుకంటే ఈ ప్రాంతం ఎంతో విభిన్నమైన అనుభూతిని ఇస్తుందని. రూప్‌కుండ్ అనేది హిమాలయాలలోని అందమైన పర్యాటక కేంద్రం. ఇది త్రిశూల్ (7120 మీ), నంద్‌ఘుంగ్టి (6310 మీ) అనే రెండు పర్వత శిఖరాల మధ్యన ఉంది. బెడ్ని బుగ్యల్ యొక్క ఎత్తైన పచ్చిక బయళ్ళ వద్ద సమీపాన ఉన్న గ్రామాల ప్రజలు ప్రతి ఆకురాలు కాలంలో ఒక సంప్రదాయ ఉత్సవం జరుపుకుంటారు. రూప్‌కుండ్ వద్ద పన్నెండు సంవత్సరాలకు ఒకసారి నందా దేవి రాజ్ జాట్ అనే అతిపెద్ద ఉత్సవం జరుగుతుంది. సంవత్సరంలో చాలా భాగం అస్థిపంజర సరస్సు మంచుతో కప్పబడి ఉంటుంది. రూప్‌కుండ్ కు వెళ్ళే ప్రయాణం ఆనందదాయకంగా ఉంటుంది. దారంతటా అన్ని వైపులా పర్వత శ్రేణులతో నిండి ఉంటుంది.
రూప్‌కుండ్ చేరటానికి వేర్వేరు మార్గాలు ఉన్నాయి. సాధారణంగా, సాహస యాత్రికులు రోడ్డు మార్గం ద్వారా లోహజంగ్ లేదా వాన్ వరకూ ప్రయాణిస్తారు. అక్కడ నుండి, వాన్ వద్ద మిట్టను ఎక్కి, రాణీకీ ధార్ చేరతారు. అక్కడ కొంత పీఠభూమి ప్రాంతం కూడా ఉంది, ఇక్కడ రాత్రివేళలో బసచేయవచ్చు. ఒకవేళ ఆకాశం స్పష్టంగా ఉంటే, బెడ్ని బుగ్యాల్, త్రిశూల్ లను చూడవచ్చును. తరువాత బెడ్ని బుగ్యాల్ వెళతారు. ఇది వాన్ నుండి 12–13 కిమీ ఉంటుంది. గుర్రాలు, గొర్రెలు, కంచరగాడిదల కొరకు పెద్ద గడ్డి మైదానాలు ఉన్నాయి. అక్కడ ఉన్న రెండు దేవాలయాలు, ఒక చిన్న సరస్సు ఆ ప్రాంతం యొక్క అందాన్ని ఇనుమడింప చేస్తూంటాయి. బెడ్ని బుగ్యాల్ నుండి హిమాలయాల శిఖరాన్ని చూడవచ్చు. పర్వతారోహకులు అక్కడ నుండి భాగువబాస వరకూ వెళతారు, అది బెడ్ని బుగ్యాల్ నుండి 10–11 కిమీ ఉంటుంది. సంవత్సరంలో అధికకాలం భాగువబాసలో వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. త్రిశూల్‌ను, 5000ల మీటర్ల కన్నా ఎత్తున్న ఇతర శిఖరాలనూ ఇక్కడ నుండి దగ్గరగా చూడవచ్చు. చుట్టూ ఉన్న పర్వతాల వాలులపై మీద అనేక జలపాతాలను, భూపాతాలనూ చూడవచ్చును. భాగువబాస నుండి, పర్వతారోహకులు రూప్‌కుండ్ గాని, శిలా సముద్రం (శిలల సముద్రం) గానీ, జునర్గాల్లి కోల్ పాస్ ద్వారా వెళతారు. ఇది సరస్సుకు కొంచం పైన ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ఈ సరస్సు వద్దకు వెళ్తే ఎంతో ఎంజాయ్ చేయొచ్చు.
Read Also : Caste Census Survey : కులగణన సర్వేకు నా వివరాలు ఇవ్వను – MLA పద్మారావు