సీతాకోక చిలుకలా ఎగిరే.. తేనెటీగలా అటాక్ చేసే ఫైటర్ హెలికాప్టర్ ” ప్రచండ్ “!!
భారత అమ్ముల పొదిలో మరో గొప్ప అస్త్రం చేరింది. దాని పేరు .. ‘ప్రచండ్’. ఇది దేశీయంగా తయారైన తేలికపాటి పోరాట హెలికాప్టర్ .
- By Hashtag U Published Date - 09:15 AM, Tue - 4 October 22
భారత అమ్ముల పొదిలో మరో గొప్ప అస్త్రం చేరింది. దాని పేరు .. ‘ప్రచండ్’. ఇది దేశీయంగా తయారైన తేలికపాటి పోరాట హెలికాప్టర్ . తాజాగా తొలి విడత ‘ప్రచండ్’ హెలికాప్టర్లను భారత వాయుసేనకు అప్పగించారు. సీతాకోక చిలుకలా అందంగా ఎగురుతూ.. తేనెటీగ మాదిరిగా అటాక్ చేయడం ‘ప్రచండ’ హెలికాప్టర్ల ప్రత్యేకత అని వాటిని తొలిసారి నడిపిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లు వ్యాఖ్యానించారు. బ్రహ్మోస్, అగ్ని, పినాకా శతఘ్నుల సరసన లైట్ కంబాట్ హెలికాప్టర్ కూడా చేరింది. దేశీయంగా తయారైన తేలికపాటి పోరాట హెలికాప్టర్ ‘ప్రచండ్’ భారత్ రక్షణ రంగ సత్తాను మరింత ఇనుమడింప జేయనుంది. ‘ప్రచండ్’ హెలికాప్టర్ క్షిపణులను, ఇతర ఆయుధాలను ప్రయోగించగలదు.
ఇదే మెరుగైన సమయం..
ఈ ఆధునిక తరం హెలికాప్టర్లను భారత వాయుసేనలో చేర్చే కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి హాజర య్యారు. రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, దేశీయంగా అభివృద్ధి చేసిన లైట్ కంబాట్ హెలికాప్టర్లు దేశ రక్షణ సామర్థ్యాన్ని పెంచుతుందన్నారు. ఎల్సీహెచ్ ఇండక్షన్కు నవరాత్రుల కంటే మెరుగైన సమయం, యోధుల భూమి రాజస్థాన్‌లో మరొకటి ఉండదన్నారు.
5.8 టన్నుల బరువుతో ..
రెండు ఇంజిన్లతో 5.8 టన్నుల బరువున్న ఈ తేలికపాటి ఈ హెలికాప్టర్లను ప్రధానంగా పర్వత ప్రాంతాల్లో మోహరించడానికి రూపొందిం చారు. శత్రు రాడార్లను బోల్తా కొట్టించే స్టెల్త్ సామర్థ్యం వీటికి ఉన్నది. నేలను బలంగా తాకినప్పటికీ తట్టుకోగలిగేలా దృఢమైన ల్యాండింగ్ గేరును వీటికి అమర్చారు. ఇప్పటికే ఇది అనేక పరీక్షలు పూర్తిచేసుకుంది. శత్రువుపై దాడి చేయడమే కాదు, ప్రమాదం ఎదురైనప్పుడు విచిత్రమైన విన్యాసాలు చేసి తప్పించు కోగలదు. రాత్రిపూట కూడా ఇది పోరాడగలదు. అన్నిరకాల వాతావరణాల్లోనూ ఇది గగనవిహారం చేయగలదు. గాల్లో అద్భుత విన్యాసాలు చేస్తూ శత్రువును గందరగోళానికి గురిచేస్తుంది. 16,400 అడుగుల ఎత్తులో ల్యాండింగ్, టేక్ ఆఫ్ కాగలదు. సియాచిన్-సాల్టోరో ప్రాంతం, తూర్పు లద్దాఖ్‌లో రక్షణాత్మక కార్యకలాపాలు నిర్వహించగలిగేలా వీటిని రూపొందించింది హాల్. 20ఎమ్ఎమ్ టరెట్ గన్లు, 70ఎమ్ఎమ్ రాకెట్ వ్యవస్థ, ఎయిర్ టు ఎయిర్ క్షిపణులతో ఆయుధాలను ఈ హెలికాప్టర్లు కలిగి ఉంటాయి. తొలిదశలో లద్దాఖ్, జమ్ముకశ్మీర్‌లోని అత్యంత ఎత్తయిన ప్రదేశాల్లో ఈ తేలికపాటి హెలికాప్టర్లను మోహరించ నున్నారు.
Related News
Emergency Landing: లడఖ్‌లో ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
భారత వైమానిక దళం (Emergency Landing) అపాచీ హెలికాప్టర్ బుధవారం కార్యాచరణ శిక్షణా విమానంలో లడఖ్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేయబడింది.