Liquor shops close: తమిళనాడు సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం.. ఆ ప్రాంతాల్లో 500 మద్యం షాపులు మూసివేత
తమిళనాడు ప్రభుత్వం సంపూర్ణ మద్యపాన నిషేధంవైపు అడుగులు వేస్తోంది. తొలి దశలో దేవాలయాలు, పాఠశాలల సమీపంలో ఉన్న 500 మద్యం దుకాణాలను మూసివేయాలని సీఎం స్టాలిన్ ఆదేశాలు జారీ చేశారు.
- Author : News Desk
Date : 23-06-2023 - 9:03 IST
Published By : Hashtagu Telugu Desk
తమిళనాడు (Tamil Nadu) సీఎం స్టాలిన్ (CM Stalin) కీలక నిర్ణయం తీసుకున్నారు. మద్యపాన నిషేదం వైపు దశలవారిగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికల సమయంలో డీఎంకే పార్టీ (DMK Party) అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని మాటిచ్చింది. అందులో భాగంగా స్టాలిన్ దశలవారిగా మద్యపాన నిషేదం అమలు చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఈ క్రమంలో తొలి విడతలో రాష్ట్రంలోని 500 మద్యం దుకాణాలను మూసివేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయినట్లు తెలిసింది.
రాష్ట్రంలోని దేవాలయాలు, పాఠశాలల పక్కన, వాటికి కొద్దిదూరంలో ఉన్న మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశాలు జారీ అయినట్లు తెలిసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవడంతోపాటు ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే స్టాలిన్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారని ప్రభుత్వం వర్గాలు తెలిపాయి. తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలో హర్షాతిరేఖాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, మందుబాబులకు మాత్రం ఇది చేదువార్తే.
సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని ఎన్నికల సమయంలో పార్టీలు ప్రకటిస్తుంటాయి. అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీని అధికశాతం ప్రభుత్వాలు పక్కనపెట్టేస్తుండటం చూస్తున్నాం. మద్యం విక్రయాల ద్వారా రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదాయం వస్తుంది. ఈ క్రమంలో భారీ ఆదాయాన్ని పొగొట్టుకునేందుకు ఏ ప్రభుత్వం సాహసం చేయలేదు. తాజాగా తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం సంపూర్ణ మద్యపాన నిషేధంవైపు అడుగులు వేస్తున్నారు. మూడు నుంచి నాలుగు దశల్లో రాష్ట్రంలోని దాదాపు 80శాతం మద్యం షాపులు తొలగించేలా స్టాలిన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తొలి దశలో 500 మద్యం దుకాణాల మూసివేతకు ఆదేశాలు జారీ అయ్యాయి.