Music Festival : యూనివర్శిటీ మ్యూజిక్ ఫెస్టివల్ లో దారుణం.. నలుగురు మెడికోలు మృతి
మూడురోజుల టెక్ ఫెస్టివల్ లో భాగంగా.. శనివారం ఈ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ ఘటనలో నలుగురు మెడికోలు ప్రాణాలు కోల్పోగా.. మరో 64 మంది గాయపడినట్లు సమాచారం.
- Author : News Desk
Date : 25-11-2023 - 11:48 IST
Published By : Hashtagu Telugu Desk
Music Festival : కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కొచిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (సీయూఎస్ఏటీ)లో నిర్వహించిన మ్యూజికల్ ఫెస్టివల్ లో తొక్కిసలాట జరిగింది. మూడురోజుల టెక్ ఫెస్టివల్ లో భాగంగా.. శనివారం ఈ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ ఘటనలో నలుగురు మెడికోలు ప్రాణాలు కోల్పోగా.. మరో 64 మంది గాయపడినట్లు సమాచారం. మృతుల్లో ఇద్దరు విద్యార్థినులు కూడా ఉన్నారు. ఘటనపై సమాచారం అందుకున్న కొచ్చి పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని.. క్షతగాత్రులను ఎర్నాకుళం ప్రభుత్వ కళాశాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో నలుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండటంతో.. వారిని స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
కాగా.. వర్సిటీకి చెందిన ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలో నిఖితా గాంధీ అనే సంగీత దర్శకుడు కన్సర్ట్ నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్ కు లిమిటెడ్ సంఖ్యలో విద్యార్థులనే అనుమతించగా.. ఎంట్రీపాస్ లేని వారంతా ఆడిటోరియం బయటే నిలబడి వీక్షించారు. ఈ క్రమంలో ఒక్కసారిగా వర్షం కురవడంతో తొక్కిసలాట జరిగింది. వర్షంలో తడిచిపోతామని ఒక్కసారిగా ఆడిటోరియంలోకి పరుగులు పెట్టడంతో భారీగా తొక్కిసలాట జరిగింది.