Dark Matter : బంగారు గనిలో “డార్క్ మ్యాటర్”.. రూ.476 కోట్ల రీసెర్చ్ ప్రాజెక్టు!
విశ్వంలోని అతిపెద్ద రహస్యాల్లో డార్క్ మ్యాటర్ (కృష్ణ పదార్థం) ఒకటి. దీనికోసం ఇప్పుడు ఒక బంగారు గనిలో అన్వేషణ చేస్తున్నారు.
- By Hashtag U Published Date - 12:00 PM, Sat - 9 July 22

విశ్వంలోని అతిపెద్ద రహస్యాల్లో డార్క్ మ్యాటర్ (కృష్ణ పదార్థం) ఒకటి. దీనికోసం ఇప్పుడు ఒక బంగారు గనిలో అన్వేషణ చేస్తున్నారు. అదే.. అమెరికాలోని దక్షిణ డకోటాలో ఉన్న శాన్ ఫర్డ్ అండర్ గ్రౌండ్ రీసెర్చ్ ఫెసిలిటి పరిధిలోని ఒక గోల్డ్ మైన్. డిజిటల్ ఎలక్ట్రానిక్ టెక్నాలజీ సాయంతో ఈ గనిలో డార్క్ మ్యాటర్ ను గుర్తించే పరిశోధన గత కొన్నేళ్లుగా జరుగుతోంది. కొవిడ్ వల్ల దానికి కొంత కాలం బ్రేక్ పడింది.మళ్లీ రెండు నెలల క్రితమే రీసెర్చ్ వర్క్ స్టార్ట్ చేశారు. ఈ గోల్డ్ మైన్ లో డార్క్ మ్యాటర్ పై రీసెర్చ్ కోసం రోచేస్టర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన సాంకేతికతను వినియోగిస్తున్నారు. ఈ పరిశోధన ప్రాజెక్టుకు “లక్స్ జెప్లిన్” అని పేరు పెట్టారు. ఒక ప్రత్యేకమైన డార్క్ మ్యాటర్ డిటెక్టర్ ద్వారా బంగారు గని వాతావరణంలో ఉన్న డార్క్ మ్యాటర్ ను గుర్తించే ప్రక్రియ మొదలైంది. వరుసగా దాదాపు 1000 రోజుల పాటు గని వాతావరణంపై డార్క్ మ్యాటర్ డిటెక్టర్ రీసెర్చ్ కొనసాగిస్తుంది.
2021 డిసెంబరులోనే దీనికి సంబంధించిన కౌంట్ డౌన్ మొదలైంది. గనిలోని వాతావరణ అంశాలకు సంబంధించి డిటెక్టర్ 1000 రోజుల పాటు సేకరించే సమాచారాన్ని విశ్లేషించి.. అక్కడ డార్క్ మ్యాటర్ ఉనికి గురించి ఒక స్పష్టతకు వస్తారు. ఈ రీసెర్చ్ కు అమెరికా ప్రభుత్వ శాఖల నుంచి కూడా నిధులు అందుతున్నాయి. ఈ రీసెర్చ్ ప్రాజెక్టు వ్యయం దాదాపు రూ.476 కోట్లు.
ఏమిటీ డార్క్ మ్యాటర్?
మన విశ్వంలో 80 నుంచి 85 శాతం ఆవరించి ఉండేది ఈ డార్క్ మ్యాటరే.ఇది కాంతితో ఎలాంటి చర్యలూ జరపదు. దీంతో ఇది మన కంటికి కనపడదు. అందుకే దీన్ని డార్క్ మ్యాటర్ అని పిలుస్తారు. అసలు ఇలాంటి పదార్థముందని పరోక్షంగా నిరూపించే ఆధారాలు మాత్రమే ఇప్పటివరకు శాస్త్రవేత్తలకు దొరికాయి. నేరుగా దీని జాడను రుజువుచేసే ఆధారాలు నేటికీ దొరకలేదు. డార్క్ మ్యాటర్ లోని
అణువులు ఎలా ఉంటాయనే అంశంపై చాలా సిద్ధాంతాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఎక్కువ మంది మద్దతు తెలిపేది వీక్లీ ఇంటెరాక్టింగ్ మాసివ్ పార్టికల్. దీన్నే డబ్ల్యూఐఎంపీగా పిలుస్తున్నారు.దీన్ని ల్యాబ్‌లో సృష్టించేందుకు కూడా పరిశోధనలు జరుగుతున్నాయి.