Tomato Rice : పక్కా కొలతలతో టొమాటో రైస్ ఇలా చేయండి.. లొట్టలేసుకుంటూ తింటారంతే..
మీడియం సైజులో కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చీలికలు, చిటికెడు ఉప్పు వేసి లేత బంగారురంగు వచ్చేంత వరకూ వేయించాలి. ఇప్పుడు అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి..
- By News Desk Published Date - 08:00 AM, Fri - 3 November 23
Tomato Rice : ఇంట్లో వంటచేయడానికి ఏ కూరగాయలు లేనప్పుడు చాలామంది ఫ్లేవర్డ్ రైస్ చేస్తుంటారు. అందులో ఫస్ట్ ఉండేది టొమాటో రైస్. కానీ.. కొందరు ఎన్నిసార్లు ట్రై చేసినా టొమాటో రైస్ పొడిపొడిగా రాదు. కుక్కర్లో ఎక్కువగా ఉడకడం వల్ల, కొలతలు సరిగ్గా తీసుకోకపోవడం వల్ల అది ముద్దగా అయిపోతుంటుంది. అందుకే ఈ కొలతలతో టొమాటో రైస్ ఒక్కసారి చేసి చూడండి. రుచికి రుచికి.. ఎంచక్కా పొడిపొడిగా ఉంటుంది. మరి టొమాటోరైస్ తయారీకి కావలసిన పదార్థాలేంటో.. ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
టొమాటో రైస్ తయారీకి కావలసిన పదార్థాలు
టొమాటోలు – ఒక మాదిరి సైజువి 5
తరిగిన ఉల్లిపాయలు – 2
పచ్చిమిర్చి – 5
పుదీనా, కొత్తిమీర – తగినంత
బియ్యం – 375 గ్రాములు (ఒకటిన్నర గ్లాసు)
కల్లుప్పు – అర టీ స్పూన్
మరాఠీ మొగ్గలు – 3
జాపత్రి -1
లవంగాలు -5
యాలకులు – 3
దాల్చిన చెక్క – కొద్దిగా
అనాసపువ్వులు – 2
షాజీరా – అర టీ స్పూన్
బిర్యానీ ఆకులు – 2
జీడిపప్పు పలుకులు – 2 టీ స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్
కారం – 1 టీ స్పూన్
నిమ్మకాయ – 1
టొమాటో రైస్ తయారీ విధానం
ముందుగా టొమాటోల తలలు కట్ చేసి కుక్కర్ లో వేసి.. అందులో కొద్దిగా నీరు, కల్లుప్పు వేసి ఉడికించుకోవాలి. అలా ఉడికిన టొమాటోలు చల్లారిన తర్వాత దానిని మిక్సీ జార్ లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడొక నాన్ స్టిక్ కళాయిలో 3-4 స్పూన్ల నెయ్యి వేసి మరాఠీమొగ్గలు, జాపత్రి, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అనాసపువ్వులు, షాజీరా, బిర్యానీ ఆకులు, జీడిపప్పు పలుకులు వేసి ఎర్రగా వేయించుకోవాలి.
మీడియం సైజులో కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చీలికలు, చిటికెడు ఉప్పు వేసి లేత బంగారురంగు వచ్చేంత వరకూ వేయించాలి. ఇప్పుడు అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంతవరకూ వేయించుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న టొమాటో గుజ్జు, కారం, రుచికి తగినంత ఉప్పు వేసుకుని, నిమ్మరసం పిండి ఐదునిమిషాలు ఉడకనివ్వాలి.
ఇప్పుడు బియ్యం కొలిచిన గ్లాసుతో 3 గ్లాసుల నీళ్లు పోసి, తరిగిన కొత్తిమీర, పుదీనా వేసుకుని మరగనివ్వాలి. కడిగి పెట్టుకున్న బియ్యాన్ని మరుగుతున్న నీటిలో వేసి బియ్యం విరిగిపోకుండా ఒకసారి కలుపుకోవాలి. నీరు ఇగిరిపోతుందనగా మరొకసారి తిప్పుకుని.. పెనంపై 10 నిమిషాలు పెట్టాలి. అంతే పొడిపొడిలాడే టేస్టీ టొమాటో రైస్ రెడీ. ఇందులో పెరుగు చట్నీ, ఉడకబెట్టిన గుడ్లు కాంబినేషన్ తో తింటే అద్భుతంగా ఉంటుంది.
Related News
Carrot Milk Shake : క్యారెట్ మిల్క్ షేక్.. పక్కా కొలతలతో ఇలా చేయండి..
ఇంట్లోనే హెల్దీగా ఉండే క్యారెట్ మిల్క్ షేక్ ను తయారు చేసుకోవచ్చు. తీపి కోసం పంచదార శరీరంలో ఎన్నో అనారోగ్యాలకు కారణమవుతుంది. పంచదార వేయకుండానే ఈ మిల్క్ షేక్ ను తయారు చేసుకోండి..