Tomato Bath: ఘమఘమలాడే టమాటో బాత్.. సింపుల్ గా ట్రై చేయండిలా?
మామూలుగా మనం టమోటా తో టమోటా కర్రీ టమోటా పప్పు, టమోటా చట్నీ, టమోటా రసం, టమోటా రైస్ ఇలా ఎన్నో రకాల రెసిపీలు ట్రై చేయడంతో పాటు అనేక
- By Anshu Published Date - 08:00 PM, Sun - 31 December 23

మామూలుగా మనం టమోటా తో టమోటా కర్రీ టమోటా పప్పు, టమోటా చట్నీ, టమోటా రసం, టమోటా రైస్ ఇలా ఎన్నో రకాల రెసిపీలు ట్రై చేయడంతో పాటు అనేక రకాల వంటల్లో కూడా టమోటాని ఉపయోగిస్తూ ఉంటాం. అయితే టమోటా రెసిపీలను చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు. అటువంటి వాటిలో టమోటా బాత్ కూడా ఒకటి. మరి ఈ టమోటా బాత్ రెసిపీ ని ఇంట్లోనే సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
టమాటో బాత్ కి కావాల్సిన పదార్ధాలు:
బొంబాయి రవ్వ – ఒక కప్పు
టమాటాలు – రెండు
క్యారెట్ తరుగు – పావు కప్పు
ఉల్లిపాయ తరుగు – అర కప్పు
బటాని – పావు కప్పు
పచ్చిమిర్చి – ఒకటి
అల్లం తరుగు – ఒక టేబుల్ స్పూన్
కరివేపాకు – ఒక రెబ్బ
కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్స్
జీడి పప్పు – కొద్దిగా
ఆవాలు – ఒక టేబుల్ స్పూన్
సెనగపప్పు – ఒక టేబుల్ స్పూన్
మినపప్పు – ఒక టేబుల్ స్పూన్
జీలకర్ర – ఒక టేబుల్ స్పూన్
పసుపు – అర టీ స్పూన్
ఉప్పు – సరిపడా
నూనె – రెండు టేబుల్ స్పూన్స్
నెయ్యి – పావు కప్పు
నీళ్ళు – మూడు కప్పులు
టమాటో బాత్ తయారీ విధానం:
ఇందుకోసం ముందుగా బొంబాయి రవ్వని సన్నని మంట మీద మంచి సువాసన వచ్చే దాక వేపుకుని పక్కన పెట్టుకోవాలి. మరొక కడాయిలో ఒక స్పూన్ నెయ్యి, రెండు స్పూన్స్ నూనె వేసి అందులో జీడిపప్పు ఎర్రగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, సెనగపప్పు, కరివేపాకు, అల్లం తరుగు వేసి ఎర్రగా వేగాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి 2 నిమిషాల పాటు వేపుకోవాలి. ఆ తరవాత టమాటో ముక్కలు వేసి 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత అందులో క్యారెట్ తరుగు, బటాని, పుసుపు, ఉప్పు వేసి వాటిని 80 శాతం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో నీళ్ళు పోసి వాటిని బాగా మరగనివ్వాలి. నీళ్ళు మరిగాక అందులో రవ్వ వేసి బాగా కలిపి మూత పెట్టి 3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆఖరులో కొత్తిమీర, జీడిపప్పు, మిగిలిన నెయ్యి వేసి బాగా కలిపి దించేయడమే.