Rat Glue Pad : ఎలుకలను పట్టే గ్లూ పేపర్ బోర్డులపై నిషేధం.. ఎందుకంటే..
గ్లూ పేపర్ బోర్డుల తయారీ, అమ్మకాలు, వినియోగాన్ని పంజాబ్ లో నిషేధించారు. ఈ బోర్డు పై ఉండే జిగురు ఎలుకలను పట్టుకుంటుంది. ఎలుకలు ఎక్కువగా తిరిగే ప్రదేశంలో..
- By News Desk Published Date - 07:30 AM, Thu - 9 November 23

Rat Glue Pad : ఇంట్లో ఎలుకల బెడద ఎక్కువగా ఉంటే.. వాటిని ఎలాగైనా వదిలించుకోవాలని రకరకాల పద్ధతులను అవలంబిస్తుంటాం. వాటిలో ఒకటి గ్లూ పేపర్ బోర్డులు. అయితే.. వీటిని ఢిల్లీ, మహారాష్ట్ర కర్ణాటక సహా వివిధ రాష్ట్రాలు నిషేధించాయి. తాజాగా ఆ జాబితాలోకి పంజాబ్ కూడా చేరింది. ఎలుకలను ట్రాప్ చేసే గ్లూ పేపర్ బోర్డులను నిషేధించాలని పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించింది.
గ్లూ పేపర్ బోర్డుల తయారీ, అమ్మకాలు, వినియోగాన్ని పంజాబ్ లో నిషేధించారు. ఈ బోర్డు పై ఉండే జిగురు ఎలుకలను పట్టుకుంటుంది. ఎలుకలు ఎక్కువగా తిరిగే ప్రదేశంలో దీనిని ఉంచితే.. ఎలుక అక్కడికి రాగానే ఇరుక్కుపోతుంది. ఆ తర్వాత అది చనిపోతుంది. ఎలుకలు ఎంతో హింస తర్వాత చనిపోతుండటంపై వివిధ రాష్ట్రాలకు చెందిన సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే వాటిని నిషేధించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇందుకు జంతువుల ప్రయోజనాలను పరిరక్షించే పెటా సంస్థ కూడా సపోర్ట్ చేసింది. గ్లూ పేపర్ బోర్డులను నిషేధించాలని పెటా ఇండియా డిమాండ్ చేసింది.
కేవలం ఎలుకలే కాదు.. ఇంట్లో ఈ రకమైన బోర్డులను ఉంచడం వల్ల పక్షులు, ఉడుతలు, చిన్నపిల్లులు కూడా చిక్కుకుని చనిపోతున్నాయని బెంగళూరు అటవీశాఖ అధికారులకు ప్రతినెలా 20-25 కేసులు నమోదయ్యేవి. ఈ క్రమంలో.. ఒక్కొక్క రాష్ట్రం గ్లూ పేపర్ బోర్డులను నిషేధిస్తూ వచ్చింది. ఎలుకలను ఇలా హింసపెట్టి చంపుతున్న వారిపై జంతుహింస చట్టం 1960 ప్రకారం చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేశారు. దీనిపై చర్యలు తీసుకున్న కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, అరుణాచల్ ప్రదేశ్, గోవా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లడఖ్, లక్షద్వీప్, మేఘాలయ, మిజోరాం, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్ గ్లూ పేపర్ బోర్డులను నిషేధించాయి. ఆ తర్వాత ఢిల్లీ, తాజాగా పంజాబ్ కూడా నిషేధించడంతో పెటా ఇండియా హర్షం వ్యక్తంచేస్తూ.. కృతజ్ఞతలు తెలిపాయి.