Kodi Pulao : అదిరిపోయే కోడి పలావ్.. పక్కా కొలతలతో ఇలా చేయండి..
మూడు ఉల్లిపాయలు బిర్యానీలోకి, రెండు బిర్యానీ కూరలోకి పొడుగ్గా కోసి పెట్టుకోవాలి. 10 మిర్చి బిర్యానీలోకి, 4 మిర్చి కూరలోకి నిలువుగా చీల్చి పెట్టుకోవాలి.
- By News Desk Published Date - 10:00 AM, Sun - 5 November 23
Kodi Pulao : కోడి పలావ్.. మనం ఎన్నోసార్లు ఇంట్లో చేసే ఉంటాం కానీ.. చేసిన ప్రతీసారీ ఒకే రుచి ఉండదు. ఒక్కోసారి ఒక్కోలా వస్తుంది. అందులో వేయాల్సిన మసాలాలు ఎక్కువ తక్కువ అవుతుంటాయి. అందుకే ఈసారి ఈ కొలతలతో కోడి పలావ్ ట్రై చేసి చూడండి.. అదిరిపోతుందంతే..
కోడిపలావ్ మసాలా కు కావలసిన పదార్థాలు
అల్లం ముక్కలు – రెండు
వెల్లుల్లి రెబ్బలు – రెండుపాయలు
ధనియాలు – 2 టీ స్పూన్లు
దాల్చినచెక్క – కొద్దిగా
లవంగాలు – 10
యాలకులు – 7-8
జాపత్రి – చిన్నది
మరాఠీ మొగ్గలు – 3
అనాసపువ్వు – 1
గసగసాలు – 2 టీ స్పూన్
పైన చెప్పినవాటన్నింటినీ ఒక మిక్సీజార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడొక అరకేజీ చికెన్ ముక్కల్ని కొద్దిగా పసుపువేసి నీట్ గా కడుక్కోవాలి. అందులో ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా రెండుస్పూన్లు, చిటికెడు పసుపు, ఒక స్పూన్ ఉప్పు, రెండు స్పూన్ల పెరుగు, కొద్దిగా వెన్న, ఒక్క కాయ నిమ్మరసం పిండి అంతా కలిసేలా కలుపుకుని.. ఒక గంటసేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి.
మూడు ఉల్లిపాయలు బిర్యానీలోకి, రెండు బిర్యానీ కూరలోకి పొడుగ్గా కోసి పెట్టుకోవాలి. 10 మిర్చి బిర్యానీలోకి, 4 మిర్చి కూరలోకి నిలువుగా చీల్చి పెట్టుకోవాలి. అలాగే పుదీనా, కొత్తిమీరలను కూడా రెడీ చేసి ఉంచుకోవాలి. ఒక అరకేజీ బియ్యాన్ని శుభ్రంగా కడిగి గంటసేపు నానబెట్టుకోవాలి.
కోడిపులావ్ తయారీ విధానం
ముందుగా ఒక బాండీలో ఒక స్పూన్ నెయ్యి, నూనె వేసుకుని వేడెక్కిన తర్వాత.. ముందుగా కోసిపెట్టుకున్న ఉల్లిపాయలు, చీల్చి పెట్టుకున్న మిర్చి వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఫ్రిడ్జ్ లో గంటసేపు ఉంచిన చికెన్ ముక్కల్ని అంతా కలిసేలా తిప్పుకోవాలి. దీనిని ఒక 80 శాతం ఉడికించుకుని పక్కనపెట్టుకోవాలి.
ఇప్పుడొక బిర్యానీ పాత్రలో నెయ్యి, నూనె వేసి.. కొద్దిగా జీడిపప్పు, చీల్చి పెట్టుకున్న 10 పచ్చిమిరపకాయలు, పొడుగ్గా కోసిపెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2-3 యాలకులు, చిన్నసైజు దాల్చినచెక్క, నాలుగు లవంగాలు, ఒక అనాసపువ్వు, రెండు మరాఠీ మొగ్గలు, రెండు బిర్యానీ ఆకులు వేసి.. ఉల్లిపాయలు ఎర్రగా వేగేలా వేయించుకోవాలి. ఆ తర్వాత 3 స్పూన్లు ముందుగా తయారు చేసుకున్న మసాలా వేసి సన్నటి సెగమీద ఓపికగా వేయించుకోవాలి.
మసాలా వేగిన తర్వాత 5 గ్లాసుల మంచినీరు పోసి.. రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర, పుదీనా వేసి బాగా మరగనివ్వాలి. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి.. 3/4 వంతు ఉడికిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న కోడికూరను వేసి మూతపెట్టుకోవాలి. కొద్దిసేపటి తర్వాత మొత్తం కలిసేలా జాగ్రత్తగా కలుపుకుని, నీరుమొత్తం ఇంకిపోయేంతవరకూ పొయ్యిపై ఉంచాలి. ఫైనల్ గా ఒక పెనం పెట్టి.. దానిపై 15 నిమిషాలు మగ్గనివ్వాలి. పొడిపొడిలాడే కోడిపులావ్ రెెడీ. ఇందులో పెరుగుచట్నీ, నిమ్మకాయ కాంబినేషన్ తో తింటే.. అదిరిపోతుంది.
Related News
Carrot Milk Shake : క్యారెట్ మిల్క్ షేక్.. పక్కా కొలతలతో ఇలా చేయండి..
ఇంట్లోనే హెల్దీగా ఉండే క్యారెట్ మిల్క్ షేక్ ను తయారు చేసుకోవచ్చు. తీపి కోసం పంచదార శరీరంలో ఎన్నో అనారోగ్యాలకు కారణమవుతుంది. పంచదార వేయకుండానే ఈ మిల్క్ షేక్ ను తయారు చేసుకోండి..