Punugula Kurma : హోటల్ స్టైల్ పునుగుల కుర్మా.. ఇంట్లోనే ఇలా తయారుచేయండి
ఇది ఇళ్లలో కంటే.. హోటల్స్ లో, కర్రీ పాయింట్స్ లో ఎక్కువగా లభిస్తుంది. దీనిని మనం కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు
- By News Desk Published Date - 07:30 AM, Fri - 10 November 23
Punugula Kurma : పునుగుల కుర్మా.. పేరు తలచుకుంటేనే నోటిలో నీళ్లూరుతున్నాయి కదూ. పెసరపప్పు పునుగులతో చేసే ఈ కుర్మా చాలా రుచిగా ఉంటుంది. అయితే ఇది ఇళ్లలో కంటే.. హోటల్స్ లో, కర్రీ పాయింట్స్ లో ఎక్కువగా లభిస్తుంది. దీనిని మనం కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు లేనపుడు ఈ పునుగుల కుర్మాను చేస్తే.. అన్నంలో, చపాతీల్లో చక్కగా తినొచ్చు. మరి పునుగుల కుర్మా ఎలా తయారు చేసుకోవాలి.. అందుకు ఏమేమి పదార్థాలు కావాలో తెలుసుకుందాం.
పునుగుల కుర్మా తయారీకి కావలసిన పదార్థాలు..
3 గంటలసేపు నానబెట్టిన పొట్టు పెసరపప్పు – 1 కప్పు
ఉప్పు – రుచికి కావలసినంత
నానబెట్టిన జీడిపప్పు – 5
నానబెట్టిన గసగసాలు – 1 టేబుల్ స్పూన్
ఉడికించిన టమాటాలు – 3
చింతపండు – 1 రెమ్మ
నూనె – 7-8 స్పూన్స్
దాల్చిన చెక్క – 1 చిన్నముక్క
దంచిన యాలకులు – 2
అనాసపువ్వు -1
బిర్యానీ ఆకు -1
చిన్నగా తరిగిన ఉల్లిపాయలు -2
తరిగిన పచ్చిమిర్చి -3
కరివేపాకు – 1 రెమ్మ
అల్లంవెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్
పసుపు – 1/4 టీ స్పూన్
కారం – 2 టేబుల్ స్పూన్స్
చిలికిన పెరుగు – అరకప్పు
జీలకర్రపొడి – 1/4 టీ స్పూన్
ధనియాలపొడి – అర టీస్పూన్
గరం మసాలా – అర టీస్పూన్
నీళ్లు – 2 కప్పులు
తరిగిన కొత్తిమీర – కొద్దిగా
పునుగుల కుర్మా తయారీ విధానం
పెసరపప్పును పొట్టుపోయేలా శుభ్రంగా కడిగి జార్ లో వేసుకోవాలి. కొద్దిగా నీరుపోసి మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో ఉప్పు వేసి కలుపుకుని ఉంచుకోవాలి. కళాయిలో డీప్ ఫ్రై కి నూనె పోసి వేడిచేయాలి. అది వేడయ్యాక పిండిని తీసుకుని చిన్నచిన్న పునుగులుగా వేసుకుని ఎర్రగా వేయించుకోవాలి. జార్ లో నానబెట్టిన జీడిపప్పు, గసగసాలు, టమాటాలు, చింతపండు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచుకోవాలి. కళాయిలో నూనెవేసి వేడి చేసి.. తర్వాత మసాలా దినుసులు వేసి వేయించుకోవాలి.
అన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపేస్ట్, మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ వేసి కలిపి 4 నిమిషాల పాటు వేగనివ్వాలి. తర్వాత పసుపు, ఉప్పు, కారం, పెరుగు, జీలకర్రపొడి, ధనియాలపొడి, గరంమసాలా వేసి కలపాలి. నూనె పైకి తేలేంతవరకూ వేయించిన తర్వాత నీళ్లుపోసి కలపాలి. నీరు మరిగిన తర్వాత పునుగులను వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మరో 5-6 నిమిషాలు ఉడికించి.. చివరిగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని అన్నంలో కలుపుకుని తింటే..అస్సలు వదలరు.
Related News
Carrot Milk Shake : క్యారెట్ మిల్క్ షేక్.. పక్కా కొలతలతో ఇలా చేయండి..
ఇంట్లోనే హెల్దీగా ఉండే క్యారెట్ మిల్క్ షేక్ ను తయారు చేసుకోవచ్చు. తీపి కోసం పంచదార శరీరంలో ఎన్నో అనారోగ్యాలకు కారణమవుతుంది. పంచదార వేయకుండానే ఈ మిల్క్ షేక్ ను తయారు చేసుకోండి..