Chicken vs Fish: చికెన్,చేప.. రెండింటిలో దేనిలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది.. ఆరోగ్యానికి ఏది మంచిదో మీకు తెలుసా?
Chicken vs Fish: మనం తరచుగా తినే చేపలు అలాగే చికెన్ లో రెండింటిలో దేనిలో ఎక్కువగా ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది అలాగే ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 08:32 AM, Mon - 1 December 25
Chicken vs Fish: మాంసాహార ప్రియులు ఎక్కువగా ఇష్టపడే వాటిలో చేపలు అలాగే చికెన్ కూడా ఒకటి. కొందరు చేపలు ఎక్కువగా ఇష్టపడి తింటే మరి కొందరు చికెన్ ఎక్కువగా ఇష్టపడి తింటూ ఉంటారు. చికెన్ నేలపై పెరిగే జంతువు నుండి వస్తే, చేప సముద్రం లేదా నీటిలో నుండి వస్తుంది. కాగా చేప మాంసం చాలా మృదువుగా, సులభంగా పొరలుగా విడిపోతుంది. అలాగే ఇవి తమదైన రుచిని కలిగి ఉంటాయి. కొన్నిసార్లు చేపల రకాన్ని బట్టి కూడా కూర రుచి మారవచ్చు. ఇక చికెన్ మాంసం కొంచెం గట్టిగా, నమలడానికి వీలుగా ఉంటుంది. చికెన్ కు చాలా వరకు తటస్థ రుచి ఉంటుంది.
కాబట్టి దీనిని మసాలాలు, సాస్ లు, మెరినేడ్ లతో అద్భుతంగా తయారు చేయవచ్చు. నాటుకోడి, బ్రాయిలర్ కోడి అంటూ రెండు రకాల కోళ్లు మనకు లభిస్తూ ఉంటాయి. ఇవి కూడా కాస్త రుచి అటు ఇటుగా ఉంటాయి. ఇకపోతే మీరు ఎక్కువ ప్రోటీన్ కోసం చూస్తున్నట్లయితే, చికెన్ బ్రెస్ట్ మంచి ఎంపిక అని చెప్పాలి. 100 గ్రాముల చికెన్ బ్రెస్ట్ దాదాపు 31 గ్రాముల ప్రోటీన్ ను అందిస్తుందట. ఇది చాలా రకాల చేపల కంటే ఎక్కువ అని చెబుతున్నారు. మరోవైపు మీరు తక్కువ కేలరీలతో ఎక్కువ ప్రోటీన్ పొందాలి అనుకుంటే వేయించని చికెన్ బ్రెస్ట్ ఉత్తమమైనదని చెబుతున్నారు. అయితే ఫ్రై చేసినప్పుడు చేప, చికెన్ రెండింటిలోనూ కేలరీలు, కొవ్వు చాలా పెరుగుతాయట. సాల్మన్, ట్యూనా వంటి కొన్ని రకాల చేపలలో కేలరీలు కొంచెం ఎక్కువగా ఉంటాయి.
అయితే ఫ్రై చేసినప్పుడు చికెన్, చేప రెండింటిలోనూ కేలరీలు, కొవ్వు పరిమాణం గణనీయంగా పెరుగుతాయట. ఇకపోతే మొత్తం ఆరోగ్య ప్రయోజనాల గురించి చూస్తే.. చేపలు ఖచ్చితంగా మెరుగైనవని చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం చేపలలో మన శరీరాలు సొంతంగా తయారు చేయలేని ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉండటమే అని చెబుతున్నారు. ఈ ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు గుండె జబ్బులు, వాపును తగ్గిస్తాయట. ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయట. ట్రైగ్లిజరైడ్ లను నియంత్రిస్తాయని, మెదడు ఆరోగ్యానికి చాలా మంచివని,అదనంగా చేపలలో విటమిన్ డి, అయోడిన్, సెలీనియం వంటి ముఖ్యమైన పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.