Alcohol Fact: మద్యం తాగిన తర్వాత ఆకలి ఎందుకు వేస్తుందో తెలుసా..?
Alcohol Fact: మద్యం సేవించడం వల్ల మెదడులోని హైపోథాలమస్ అనే ముఖ్యమైన భాగం ప్రభావితమవుతుంది. ఇది ఆకలి, శరీర ఉష్ణోగ్రత, హార్మోన్ సమతుల్యం వంటి కీలక క్రియలను నియంత్రిస్తుంది
- By Sudheer Published Date - 08:11 AM, Mon - 29 September 25

మద్యం (Alcohol ) సేవించడం అనేది ప్రపంచవ్యాప్తంగా కామనే. పాశ్చాత్య దేశాల్లో సాధారణంగా బీర్, వైన్, కాక్‌టెయిల్స్ వంటి తక్కువ ఆల్కహాల్ శాతం ఉన్న పానీయాలను స్నేహితుల సమక్షంలో లేదా చిన్న చిన్న సమావేశాల్లో మాత్రమే మితంగా తాగుతారు. అందువల్ల తేలికపాటి స్నాక్స్‌కే పరిమితం అవుతారు. అయితే భారతదేశం వంటి దేశాల్లో మద్యం ఎక్కువ ఆల్కహాల్ శాతం కలిగిన విస్కీ, రమ్ వంటి పానీయాల రూపంలో పెద్ద విందులు, పార్టీలు, సామాజిక వేడుకలలో తీసుకుంటారు. ఇది పెద్ద భోజనాలు, స్నాక్స్‌తో కలిపి తాగే అలవాటు ఎక్కువగా ఉండటానికి దారితీస్తుంది.
మద్యం సేవించడం వల్ల మెదడులోని హైపోథాలమస్ అనే ముఖ్యమైన భాగం ప్రభావితమవుతుంది. ఇది ఆకలి, శరీర ఉష్ణోగ్రత, హార్మోన్ సమతుల్యం వంటి కీలక క్రియలను నియంత్రిస్తుంది. 2017లో జరిగిన శాస్త్రీయ అధ్యయనం ప్రకారం, మద్యం తాగిన తర్వాత AgRP (Agouti-related peptide) న్యూరాన్లు సక్రియమై “తినాలి” అనే సంకేతాలను మెదడుకు పంపిస్తాయి. దీని ఫలితంగా రుచి, వాసనలకు సున్నితత్వం పెరిగి, తినే ఆహారం సాధారణంగా కంటే రుచిగా అనిపిస్తుంది. అలాగే, మద్యం రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని తగ్గించడం వల్ల శరీరం వెంటనే శక్తి కోసం ఎక్కువ ఆహారం కావాలనే సంకేతాలు ఇస్తుంది.
మద్యం తాగిన తర్వాత మన స్వీయ నియంత్రణ తగ్గిపోవడం కూడా ఒక ప్రధాన కారణం. ఎంత తినాలో, ఏమి తినాలో నిర్ణయించడంలో మెదడు లోపాలు చూపుతుంది. ఫలితంగా అధిక కేలరీలు, తీపి, ఉప్పు, కొవ్వు ఎక్కువగా ఉన్న జంక్ ఫుడ్‌ను ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. 2015లో జరిగిన పరిశోధనల ప్రకారం కూడా మద్యం తర్వాత ఉప్పు, కొవ్వు పదార్థాలపై మనకు ఎక్కువ ఆకర్షణ కలుగుతుంది. కాబట్టి మద్యం తాగేటప్పుడు ఈ శారీరక, మానసిక ప్రక్రియలను గుర్తుంచుకుని, ఆహార పరిమితి, ఆహార ఎంపికల విషయంలో కొంత నియంత్రణ పాటించడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.