Startup Founder : 86 ఏళ్ల ఏజ్ లో స్టార్టప్ అయ్యాడు
ఇటీవల sonyliv టీవీలో Shark Tank India S2 షోలో భాగంగా ప్రసారమైన ఒక ఎపిసోడ్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ
- By Prasad Published Date - 07:43 AM, Mon - 30 January 23

ఇటీవల sonyliv టీవీలో Shark Tank India S2 షోలో భాగంగా ప్రసారమైన ఒక ఎపిసోడ్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ షోలో ఎంతోమంది స్టార్టప్స్ పాల్గొన్నారు. వీరందరిలోనూ వెరీ వెరీ స్పెషల్ రాధా కృష్ణ చౌదరి. ఎందుకంటే ఆయన వయసు 86 ఏళ్ళు. ఈ షోలో కనిపించిన అతిపెద్ద వయస్కుడైన స్టార్టప్ ఆయనే. వయసు మీద పడినా ఆయనలోని క్రియేటివిటీ, బిజినెస్ మైండ్ సెట్ కొంచెం కూడా తగ్గకపోవడాన్ని చూసి షోలో పాల్గొన్న మిగతా స్టార్టప్స్ ఫిదా అయ్యారు. రాధా కృష్ణ చౌదరిపై ప్రశంసల జల్లు కురిపించారు.
ప్రెజెంటేషన్ వహ్వా..
ఆయుర్వేద , ఆధునిక పదార్థాలతో జుట్టు, చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉత్పత్తి చేసే తన స్టార్టప్ “అవిమీ హెర్బల్” గురించి రాధా కృష్ణ చౌదరి ఇచ్చిన ప్రెజెంటేషన్ వహ్వా అనిపించింది. “నా జ్ఞానం, ఆయుర్వేద అభిరుచి ద్వారా నేను ప్రజల జుట్టు, చర్మ సమస్యలను పరిష్కరించి వారికి ఆనందాన్ని పంచాలను కుంటున్నాను. ప్రజల వెంట్రుకలను తిరిగి పెంచాలని నేను సంకల్పించాను” అని చౌదరి షోలో పేర్కొన్నారు.
3 ప్రోడక్ట్స్ నుంచి 27 దాకా..
గుజరాత్‌కు చెందిన స్టార్టప్ “Avimee” ఆగస్టు 2021లో కేవలం 3 ప్రోడక్ట్స్ తో కార్యకలాపాలు ప్రారంభించింది. ఇప్పుడు దీని వద్ద 27 ప్రోడక్ట్స్ ఉన్నాయి. దుబాయ్‌లోనూ తన ప్రోడక్ట్స్ ను లాంచ్ చేసేందుకు రాధా కృష్ణ చౌదరి రెడీ అవుతున్నారు. ఈ ఉత్పత్తులు కంపెనీ వెబ్‌సైట్‌లో , అమెజాన్ వంటి మార్కెట్‌ప్లేస్‌లలో అందుబాటులో ఉన్నాయి. సున్నా మార్కెటింగ్ ఖర్చుతో FY22లో ₹6.5 కోట్ల విలువైన ఉత్పత్తులను విక్రయించినట్లు రాధా కృష్ణ చౌదరి Shark Tank India S2 షోలో తెలిపారు. Avimee వ్యవస్థాపక సభ్యులలో రాధా కృష్ణ చౌదరితో పాటు ఆయన కుమార్తె వినీతా అగర్వాల్, మనవళ్లు విభోర్ , సిద్ధాంత్ అగర్వాల్ , సిద్ధాంత్ భార్య అంబికా అగర్వాల్ ఉన్నారు.
రాధా కృష్ణ చౌదరి బ్యాక్ గ్రౌండ్ ఇదీ..
వాస్తవానికి బీహార్‌కు చెందిన రాధా కృష్ణ చౌదరి 1957లో కామర్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు (1947 లో) అతని వయస్సు కేవలం 10 సంవత్సరాలు.ఆయనకు చిన్నప్పటి నుంచీ ఆయుర్వేదం పట్ల ఆసక్తి. గత మూడు దశాబ్దాలుగా ఆయుర్వేదం , జుట్టు రాలడంపై పరిశోధనలు చేస్తున్నాడు . కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత కూతురు వినీత విపరీతమైన జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంది. ఆమెకు సహాయం చేయడానికి చౌదరి స్వయంగా ఒక హెయిర్ ఆయిల్‌ని అభివృద్ధి చేశాడు.“నా కూతురు జుట్టు రాలే సమస్యను ఎలాగైనా పరిష్కరించాలని నేను నిర్ణయించుకున్నాను. పూర్తి పరిశోధన తర్వాత ఒక ఫార్ములా సిద్ధం చేశాను. నేను అద్భుత ఫలితాలతో నూనెను సిద్ధం చేశాను… నేను నూనెను తయారు చేయడం పూర్తి చేసి, ఆమెను (అతని కుమార్తె) అప్రూవల్ కోసం దరఖాస్తు చేయమని అడిగాను .అయితే ఆమె .. నాన్న, నువ్వే అప్లై చెయ్ అని చెప్పింది ” షోలో చౌదరి వివరించారు.
నా బట్టతలపై కూడా..
” నా హెయిర్ ఆయిల్ ప్రభావవంతంగా ఉందని రుజువైంది. కేవలం వినీతకే కాదు, 85 ఏళ్ల వయస్సులో నా బట్టతలపై కూడా వెంట్రుకలు తిరిగి పెరిగాయి. తొలినాళ్లలో మేం మా కంపెనీ హెయిర్ ఆయిల్ ను కుటుంబ సభ్యులు, స్నేహితుల సర్కిళ్లలో ఫ్రీ గా పంచాం” అని చౌదరి చెప్పారు.
రిటైర్‌మెంట్ అనే పదాన్ని నా డిక్షనరీ నుంచి తీసేశాను
అయితే Shark Tank India S2 షోలో రాధా కృష్ణ చౌదరిని ఒక ప్రశ్న అడిగారు. “చాలామంది 60 సంవత్సరాల వయస్సులో పదవీ విరమణ చేస్తున్నారు. మీరు 85 సంవత్సరాల వయస్సులో వ్యాపారాన్ని ఎలా ప్రారంభించారు?” అని ప్రశ్నించారు.
“ఇలాంటి వారందరికీ చెబుతున్నాను . రిటైర్‌మెంట్ అనే పదాన్ని నా డిక్షనరీ నుంచి తొలగించాను” అని ఆయన బదులిచ్చారు. ఈ మాటలు విన్న CarDekho.com సహ వ్యవస్థాపకుడు అమిత్ జైన్ తన సొంత తాతను గుర్తు చేసుకున్నారు. వెంటనే చౌదరి దగ్గరికి వచ్చి ఆశీర్వాదాలు తీసుకున్నారు.