India: చట్టంలో మహిళా వివాహ వయసు పెంచితే సమానత్వం అవుతుందా?
అమ్మాయిల కనీస వివాహ వయసును 18 సంవత్సరాలుగా 1978లో నిర్ణయించారు దాన్నీ సవరిస్తూ అమ్మాయిల కనీస వివాహ వయసును 21 సంవత్సరాలకు పెంచేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీనిని పురుషులతో సమానంగా 21 సంవత్సరాలు చేసేందుకు కేంద్ర క్యాబినెట్ అంగీకారం తెలిపింది.
- By hashtagu Published Date - 11:59 AM, Sat - 18 December 21

అమ్మాయిల కనీస వివాహ వయసును 18 సంవత్సరాలుగా 1978లో నిర్ణయించారు దాన్నీ సవరిస్తూ అమ్మాయిల కనీస వివాహ వయసును 21 సంవత్సరాలకు పెంచేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీనిని పురుషులతో సమానంగా 21 సంవత్సరాలు చేసేందుకు కేంద్ర క్యాబినెట్ అంగీకారం తెలిపింది. ఈ నిర్ణయానికి అనుగుణంగా ప్రత్యేక వివాహ చట్టం (1954), బాల్య వివాహాల నిరోధక చట్టం (2006), హిందూ వివాహ చట్టం(1955)లో కూడా తగిన సవరణలు చేయాల్సి ఉంటుంది.
కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ నియమించిన సమతా పార్టీ మాజీ ఛైర్మన్ జయ జైట్లీ నేతృత్వంని ఈ కమిటీ అమ్మాయిల కనీస వివాహ వయసును 21 సంవత్సరాలకు పెంచాలని ప్రతిపాదించింది. ఇందు కోసం దేశవ్యాప్తంగా 16 యూనివర్సిటీలు, 15 స్వచ్చంద సేవాసంస్థల నుంచి అభిప్రాయాలను సేకరించింది. స్కూళ్లలో లైంగిక విద్యను తప్పని సరి చేయాలని కూడా ఈ కమిటీ సూచించింది. లింగ సమానత్వాన్ని సాధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతుంది.
సామాజిక వాతావరణాన్ని ప్రక్షాళన చేయకుండా వివాహ వయో పరిమితిని పెంచడంలో అర్ధం లేదు. బాలికలపై చూపించే వివక్షకు మూలకారణాలను తెలుసుకోకుండా సమానత్వాన్ని సాధించడం కష్టం. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గణాంకాల ప్రకారం భారతదేశంలో 2019-20 నాటికి బాల్య వివాహాలు 23% ఉన్నట్లు తేలింది. 18 సంవత్సరాలు ఉన్నపుడే బాల్య వివాహాలను నియంత్రించడంలో ప్రభుత్వాలు విఫలం అయ్యాయి. బాల్య వివాహాలు శిశు మరణాలకు, ప్రసూతి మరణాలకు కూడా కారణం అవుతున్నాయి.
యుక్తవయసులో ఉన్న 51% చదువు లేని అమ్మాయిలు, ప్రాధమిక విద్యను మాత్రమే అభ్యసించిన 47% అమ్మాయిలు 18 సంవత్సరాలు లోపే వివాహం చేసుకున్నట్లు యూఎన్‌ఎఫ్‌పీఏ ఇండియా-2020 నివేదిక చెబుతోంది. ప్రభుత్వం మహిళల విద్యను ప్రోత్సహించడం ఎంత అవసరమో ఈ నివేదిక ఒక సారి చూస్తే అర్థం అవుతుంది. దేశం లోని వేలాది పాఠశాలల్లో బాలికలకు కనీస మౌలిక వసతులు కలిపించడం లో కూడా మన ప్రభుత్వాలు విఫలం ఆయ్యాయి. కార్పొరేట్ సంస్థల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో, సినిమా రంగంలోనే మహిళలపై లైంగిక దాడులు విపరీతంగా జరుగుతున్నాయి అంటే గ్రామీణ ప్రాంతాల్లో సంగతేంటి? నిత్యం మైనర్ బాలికలపై లైంగిక దాడులు జరగడం రోజురోజుకు పెరుగుతున్నాయి కానీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. చట్ట సభల్లో మహిళలపై చేస్తున్న అసభ్యకర వ్యాఖ్యలు చూస్తే ఆవేదన వ్యక్తం అవుతుంది. బెంగాల్ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మమతా బెనర్జీని ఉద్దెశించి ‘దీదీ ఓ దీదీ’ అని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. మొన్నటికి మొన్న CBSC ప్రశ్నాపత్రంలో స్త్రీలకు స్వేచ్ఛ లభించడం వల్లనే పిల్లలో క్రమశిక్షణ పోయింది అని ఓ వ్యాసంలో ప్రచురించిందంటే మన నాగరికత ఎటువైపు వెళ్తుందో అర్ధం చేసుకోవచ్చు. అమ్మాయిలకు సురక్షిత వాతావరణం లేకపోవడం, లైంగిక వేధింపులు కూడా బాల్య వివాహాలకు దారి తీస్తున్నాయి. బాల్య వివాహాలపై పోరాటం మొదలై 150 సంవత్సరాలు గడిచిపోయినా, నేటికీ ఇదొక సమస్యగానే ఉండిపోవడం విచారకరం.
చట్టంలో మార్పులు చేసినంత మాత్రాన మహిళా సాధికారత వస్తుందని చెప్పలేం, కానీ.. ఇదొక మార్పుకు నాంది పలుకుతుందని భావించొచ్చు. “సాధికారతకు సమానత్వం తొలి మెట్టు” సమానత్వ భావన అనేది సమాజంలో వచ్చేవరకూ సాధికారత సాధ్యం కాదు.
అమ్మాయిల వివాహ వయసును పెంచడం ద్వారా పిల్లలు, మహిళల పై మాత్రమే కాకుండా కుటుంబం, ఆర్ధిక, సామాజిక పరిస్థితుల పై కూడా ప్రభావం చూపిస్తుందని కమిటీ అభిప్రాయపడింది. కానీ.. చట్టం, సమాజం నిరంతరం ఒక దాని పై మరొకటి ప్రభావం చూపిస్తాయి. సామాజిక మార్పులను తీసుకొచ్చేందుకు చట్టం కూడా ఒక ఆయుధంగా పని చేస్తుంది. సమాజంలో వచ్చే మార్పులు కూడా చట్టంలో ఎప్పటికప్పుడు ప్రతిబింబిస్తూ ఉండాలి.