Diwali Effect : దీపావళి ఎఫెక్ట్ కిక్కిరిసిన రైళ్లు..ప్రయాణికుల గగ్గోలు
Diwali Effect : దీపావళి పండగ సీజన్ వచ్చేసరికి దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు, రైళ్లు జనసంద్రమై మారాయి. ప్రజల స్వస్థలాల చేరిక కోసం రైల్వే శాఖ 12,000 ప్రత్యేక రైళ్లు నడిపించినట్లు ప్రకటించినా, ప్రయాణికుల రద్దీని చూస్తే ఆ సంఖ్య సరిపోలేదని తేలిపోయింది
- By Sudheer Published Date - 04:00 PM, Tue - 21 October 25

దీపావళి పండగ సీజన్ వచ్చేసరికి దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు, రైళ్లు జనసంద్రమై మారాయి. ప్రజల స్వస్థలాల చేరిక కోసం రైల్వే శాఖ 12,000 ప్రత్యేక రైళ్లు నడిపించినట్లు ప్రకటించినా, ప్రయాణికుల రద్దీని చూస్తే ఆ సంఖ్య సరిపోలేదని తేలిపోయింది. ముఖ్యంగా బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల దిశగా వెళ్తున్న రైళ్లు కిక్కిరిసి పోయాయి. ఈ ప్రాంతాల ప్రజలు దీపావళి, ఛాత్ పూజను తమ కుటుంబ సభ్యులతో జరుపుకునేందుకు తప్పక స్వస్థలాలకు వెళ్తారు. ఈ కారణంగా ప్రతి ఏడాది అక్టోబర్–నవంబర్ నెలల్లో దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల నుంచి ఉత్తరాదికి ప్రత్యేక రైళ్లు నడిపించడం ఆనవాయితీగా మారింది. కానీ ఈసారి ప్రయాణికుల సంఖ్య అంచనాలకు మించి ఉండటంతో, రైళ్లలో అడుగు పెట్టడమే కష్టంగా మారింది.
Lokesh : ఆస్ట్రేలియా పర్యటనలో నారా లోకేష్ సక్సెస్.. రొయ్యల ఎగుమతులకు గ్రీన్ సిగ్నల్
రైలు బోగీలన్నీ సామాన్యంగా కాదు, జనరల్ కోచ్‌లు, స్లీపర్ క్లాస్, ఇంతకుముందు ఎప్పుడూ ఖాళీగా ఉండే ఏసీ బోగీలు కూడా కిక్కిరిశాయి. రిజర్వేషన్ లేకుండా వందల మంది ప్రయాణికులు బోగీల్లోకి దూరిపోవడంతో రిజర్వ్ సీట్లపై కూర్చోవడమే కష్టమైంది. అడ్వాన్స్ టికెట్లు తీసుకున్న ప్రయాణికులకే సీట్లు దొరకని పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల సీట్లను ముందుగా ఆక్రమించిన గుంపులు వదలడానికి నిరాకరించడంతో తగాదాలు చోటుచేసుకున్నాయి. “టికెట్ తీసుకున్నా కూర్చోడానికి చోటు దొరకలేదు, రైలు ఎక్కడం కూడా యుద్ధం లా అనిపించింది” అంటూ ఒక మహిళా ప్రయాణికురాలు మీడియాతో తన ఆవేదనను వ్యక్తం చేశారు. రైలు ఎక్కడానికి స్టేషన్ల వద్ద పెద్ద క్యూలు, తోపులాట, ఆందోళనలతో ప్రయాణికులు విసిగిపోయారు.
ప్రయాణికుల రద్దీకి ప్రధాన కారణం దీపావళి, ఛాత్ పూజ పండగల సమయములో ఉత్తరాదికి భారీ వలస ప్రయాణం కావడమే. రైల్వే అధికారులు అదనపు రైళ్లు నడిపినప్పటికీ, అవి డిమాండ్‌ను తీరించలేకపోయాయి. కొన్నిచోట్ల రైళ్లు రద్దీ కారణంగా ఆలస్యంగా నడవడం, స్టేషన్ల వద్ద అదుపు తప్పిన గుంపులు కనిపించడం కూడా సాధారణమైంది. ఈ పరిస్థితులు రైల్వే మౌలిక వసతులు, అదనపు సిబ్బంది అవసరం ఎంత అత్యవసరమో మరోసారి స్పష్టంచేశాయి. ప్రజల సౌకర్యార్థం రైల్వే శాఖ భవిష్యత్తులో అడ్వాన్స్ రిజర్వేషన్ సిస్టమ్ సవరించడం, ప్రత్యేక రైళ్ల సంఖ్యను పెంచడం, రద్దీ నియంత్రణ చర్యలు తీసుకోవడం వంటి చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. మొత్తానికి, ఈ దీపావళి సీజన్‌లో రైలు ప్రయాణం కొందరికి ఆనందయానం కాకుండా దుర్భర అనుభవంగా మిగిలిపోయింది.