Bambino Agro Industries : బాంబినో వ్యవస్థాపకుడి కుటుంబంలో ఆస్తి వివాదం
Bambino Agro Industries : బాంబినో సంస్థ హైదరాబాద్ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన భారతీయ బ్రాండ్‌గా గుర్తింపు పొందింది. సేమియా, మాకరోనీ, పాస్తా ఉత్పత్తుల్లో భారత మార్కెట్లో అగ్రగామిగా నిలిచిన ఈ సంస్థ
- By Sudheer Published Date - 12:59 PM, Tue - 21 October 25

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఆహార తయారీ సంస్థ ‘బాంబినో అగ్రో ఇండస్ట్రీస్’ వ్యవస్థాపకుడు మ్యాడం కిషన్ రావు (Bambino Agro Industries Myadam Kishan Rao) కుటుంబంలో ఆస్తుల పంపకం, షేర్ల బదిలీకి సంబంధించిన తీవ్ర వివాదం వెలుగులోకి వచ్చింది. కిషన్ రావు మనవడు కార్తికేయ హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులకు చేసిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం బయటపడింది. ఫిర్యాదు ప్రకారం.. కిషన్ రావు మరణానంతరం ఆయన నలుగురు కుమార్తెలు అనూరాధ (ఎంకే రావు ఫౌండేషన్ ట్రస్టీ), శ్రీదేవి, ఆనందదేవి, తుల్జాభవాని వీలునామా (will) నిబంధనలను ఉల్లంఘిస్తూ, ఆయన పేరిట ఉన్న షేర్లను అక్రమంగా తమ పేర్లకు బదిలీ చేసుకున్నారట. కార్తికేయ ఆరోపణల మేరకు సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
H-1B Visa Fee : H-1B వీసా ఫీజు.. విదేశీ విద్యార్థులకు గుడ్ న్యూస్
మ్యాడం కిషన్ రావు 1973లో రేవతి టొబాకో కంపెనీని స్థాపించి, ఆ తరువాత 1982లో బాంబినో అగ్రో ఇండస్ట్రీస్‌ను ప్రారంభించారు. ఈ రెండు కంపెనీల్లోనూ ఆయనకు విస్తృత స్థాయిలో వాటాలు ఉన్నాయి. రేవతి టొబాకో కంపెనీలో కిషన్ రావు వాటా 98.23 శాతం, ఆయన భార్య సుగంధబాయి వాటా 1.77 శాతంగా నమోదైంది. ఈ సంస్థకు రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నందివనపర్తిలో సుమారు 184 ఎకరాల భూమి ఉంది. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం దీని మొత్తం ఆస్తి విలువ రూ.120 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. కిషన్ రావు 2021లో మరణించిన తరువాత, ఆయన కుటుంబ సభ్యుల మధ్య ఈ ఆస్తుల పంపకం, షేర్ల యాజమాన్యం అంశాలపై విభేదాలు ఉద్భవించాయి. కార్తికేయ ప్రకారం, నలుగురు కుమార్తెలు ఒక్కొక్కరూ 24.55 శాతం చొప్పున షేర్లను తమ పేర్లకు బదిలీ చేసుకున్నారని, ఇది పూర్తిగా చట్ట విరుద్ధమని పేర్కొన్నారు.
బాంబినో సంస్థ హైదరాబాద్ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన భారతీయ బ్రాండ్‌గా గుర్తింపు పొందింది. సేమియా, మాకరోనీ, పాస్తా ఉత్పత్తుల్లో భారత మార్కెట్లో అగ్రగామిగా నిలిచిన ఈ సంస్థ, దేశీయ మార్కెట్‌తో పాటు ప్రపంచంలోని 35 దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. స్నాక్స్, మసాలాలు, ఇతర ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల తయారీలోనూ బాంబినో తన వ్యాపారాన్ని విస్తరించింది. ఇంత పెద్ద స్థాయిలో ఉన్న సంస్థ వెనుక కుటుంబ అంతర్గత విభేదాలు బయటపడటంతో వ్యాపార వర్గాల్లో కలకలం రేగింది. కిషన్ రావు వీలునామాలో పేర్కొన్న ఆస్తుల పంపకం విధానం, షేర్ల యాజమాన్య వివరాలు, వాటి బదిలీ పత్రాల చెల్లుబాటు వంటి అంశాలపై సీసీఎస్ పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. ఈ కేసు బాంబినో గ్రూప్ భవిష్యత్ యాజమాన్యంపై కీలక ప్రభావం చూపే అవకాశముందని న్యాయ వర్గాలు భావిస్తున్నాయి.